Leopard - హమ్మయ్య...ఎట్టకేలకు చిక్కిన చిరుత..

Leopard - హమ్మయ్య...ఎట్టకేలకు చిక్కిన చిరుత..

ముద్ర,హైదరాబాద్:- శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆరు రోజులుగా ఓ చిరుత కలకలం రేపింది. ఆరు రోజుల క్రితం గొల్లపల్లి మీదుగా ఎయిర్‌పోర్టు ఫెన్సింగ్‌ దూకి ఎయిర్ పోర్ట్ రన్‌వే మీదకు వచ్చింది. గోడ దూకుతున్నప్పుడు చిరుత ఫెన్సింగ్‌కు కాలు తగలడంతో అలార్మ్స్‌ మోగాయి. దీంతో ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. అప్పటి నుంచి అక్కడక్కడే తిరుగుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ఎంత పట్టుకుందామన్నా తప్పించుకుని తిరిగింది. చిరుత కోసం ఎయిర్ పోర్ట్ సిబ్బందే కాక అటవీ శాఖ ప్రత్యేక బృందాలు కూడా తెగ గాలించాయి.

ఎయిర్ పోర్ట్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో చిరుత ఫెన్సింగ్‌ దూకినట్టు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 20కి పైగా ట్రాప్ కెమెరాలు, 5 బోన్లు పెట్టారు చిరుత కోసం. ఆరు రోజులుగా బోన్ వరకు వచ్చి చిరుత మళ్ళీ వెనక్కు వెళ్ళిపోయింది. ప్రతీరోజు ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అయిన చిరుత దృశ్యాలు రికార్డ్ అవుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఇవాళ తెల్లవారు ఝామున 2 గంటలకు బోనులో చిరుత చిక్కింది. ఎరగా వేసిన మేకను తినడానికి వచ్చిన చిరుత బోనులో ఉండిపోయింది. దీంతో ఎయిర్ పోర్ట్ అధికారులు, అటవీశాఖ ప్రత్యేక బృందాలు ఊపిరి పీల్చుకున్నారు.