దుబ్బాక ఎమ్మెల్యే అయినంక మళ్ళీ  గుడికి రా ప్రభాకర్ అన్న - ఎంపీ ప్రభాకర్ రెడ్డి నీ కోరిన మంత్రి హరీష్ రావు

దుబ్బాక ఎమ్మెల్యే అయినంక మళ్ళీ  గుడికి రా ప్రభాకర్ అన్న - ఎంపీ ప్రభాకర్ రెడ్డి నీ కోరిన మంత్రి హరీష్ రావు

ముద్ర  ప్రతి నిధి, సిద్దిపేట : అన్నా  ప్రభాకర్ అన్న రా... టైం కి వచ్చినావు... కొట్టు కొబ్బరికాయ కొట్టే... అన్న దుబ్బాక ఎమ్మెల్యే అయినాక మల్లా ఈ గుడికి రావాలని, ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకొని పోయే... ఈ మాటలు అన్నది ఎవరో సాదాసీదా వ్యక్తి కాదు.. రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.సిద్దిపేటలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద మంత్రి హరీష్ రావు రామ కళ్యాణ భవనానికి నిర్మాణానికి మంగళవారం నాడు భూమి పూజ చేస్తుండగా.. అప్పుడే అక్కడికి వచ్చిన మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి అన్న వ్యాఖ్యలు ఇవి. .. దుబ్బాక శాసన సభ్యునిగా పనిచేస్తూ జర్నలిస్టు సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో ఆకస్మికంగా మరణించగా, వచ్చిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత కొద్ది ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన మాధవనేని రఘునందన్ రావు గెలుచుకొని ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా దుబ్బాక కు ప్రాతిథ్యం వహిస్తున్నాడు.

ఇప్పుడు... వచ్చే శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి మళ్లీ పోటీ చేసే రఘునందన్ రావు ఓడించేందుకు మెదక్ పార్లమెంటు సభ్యుడు, దుబ్బాక మండలం పోతారం గ్రామ నివాసి అయిన కొత్త ప్రభాకర్ రెడ్డిని భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలపనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసిఆర్ ముందే ప్రకటించారు. దీంతో కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఈ ప్రాంతంలో అత్యధిక పర్యటనలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆంజనేయ స్వామి భక్తుడు. ఏటేటా తన స్వగ్రామంలో సీతారామ కళ్యాణాన్ని కుటుంబ సమేతంగా పాల్గొని అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు .ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మరోసారి అసక్తిని రేపాయి.. అనంతరము తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దుబ్బాక లో నిర్వహిస్తున్న మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు మంత్రి ఎంపి కలిసి దుబ్బాక కు వెళ్లారు.