రక్తదానం.. ప్రాణదానం ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్తదానం చేయాలి

రక్తదానం.. ప్రాణదానం  ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్తదానం చేయాలి
  • రక్తదానం చేయడంలో యువజనుల, స్వచ్ఛంద సంస్థల ముందంజ
  • 14 తేదీన  ప్రపంచ రక్తదాతల దినోత్సవం

మెట్‌పల్లి ముద్ర: రక్తదానం అనేది దాదాపు ప్రాణ దానం లాంటిది.. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. అన్ని దానాల్లోకెల్లా మిన్న రక్తదానం. ఎందుకంటే... ప్రాణాపాయస్థితిలో వున్న వ్యక్తికి రక్తం ఇచ్చి ప్రాణం కాపాడడమంటే...అంతకన్నా పరోపకారం ఏముంటుంది.. అన్నదానం, విద్యాదానం చేయాలన్నా ప్రాణమున్నంత వరకే మనిషికే చేస్తాం. అలాంటి ప్రాణాలనే నిలబెట్టే మహత్తర దానం రక్తదానం. రక్తదానం సేవ మాత్రమే కాదుప్రతి పౌరుడు. బాధ్యతగా భావించాలి. సమయానికి రక్తం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేస్తే మానవత్వమే మీకు పాదాభివందనం చేస్తుంది. కోరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో మంది రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఎన్నో స్వచ్చంద సంస్థలు, యువజన సంఘాల సభ్యులు రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్నారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ముద్ర  లో ప్రత్యేక కథనం.

ప్రతి యేడు జూన్ 14న రక్తదాతల దినోత్సవం... 

'రక్తదానం చేయండి.. ప్రపంచంలోని అందరి గుండెలు ఆగకుండా పరిగెత్తేలా చేయండి' అనే నినాదంతో ప్రతి ఏడాది ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే 2005 మే లోనే అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. కాగా రక్తాన్ని ఏ, బీ, ఏబీ, ఓ పాజిటివ్, నెగెటివ్ గ్రూపుల ను కార్ల్ లాండ్ స్టీవర్ గుర్తించారు. ఆయన జన్మదినం జూన్ 14న ఉండడంతో అదే రోజున ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణ యించారు. అప్పటి నుండి ప్రతి యేడు రక్తదాతల దినో త్సవాన్ని నిర్వహిస్తున్నారు.

రక్త దానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...

రక్తదానం చేయడం వల్ల కలిగే ఓ మంచి ఆరోగ్య ప్రయో జనాల్లో ఐరన్ నిల్వలు సమతుల్యం అవడం ఒకటి. అనేక పరిశోధనలు, అద్యయనాల ప్రకారం చాలా మందిలో వారు తీసుకొనే ఆహారాన్ని బట్టే ఐరన్ నిల్వలు ఉంటాయి అని కనుగొన్నారు. కాబట్టి శరీరంలో ఇనుము స్థాయిని సమతుల్యం కోసం రక్తం దానం చేయడం చాలా మంచిది. రక్తంలో ఎక్కువగా ఐరన్ ఉంటే గుండెకు హాని చేస్తుంది. కార్డియోవాస్కులర్ వ్యాధులను నివారించేందుకు రక్తదానం చేయడం మంచిది. రక్తం దానం చేయడం వల్ల మహిళల్లో రుతుస్రావం ద్వారా ఇనుము స్థాయిల్లో సమతుల్యత జరుగుతుంది. శరీరంలో ఐరన్ నిల్వల స్థాయి తగ్గడం వల్ల(తక్కువగా) ఉండటం వల్ల క్యాన్సర్ లక్షణాలను తగ్గిస్తుంది. రక్తదానం చేయడం వల్ల  ప్రత్యేకంగా పెద్దపేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. ఒక మనిషి రక్త దానం చేసినప్పుడు, రక్త పరిమాణం సమతుల్యం చెంది రక్తపోటును నిరోధిస్తుంది. కాబట్టి ఒక ఆరోగ్యకర మైన గుండె, గుండె సంబంధిత వ్యాధులను నివారించ దానికి రక్తదానం చేయడం మంచిదే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని రక్త కణాల్లో కొలెస్ట్రాల్ నిల్వ ఉంటుంది. ఎర్ర రక్తకణాల్లో చెడు, మంచి కొలెస్ట్రాల్  ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి రక్తదానం చాలా ఉపయోగకరం. అంతే కాకుండా ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు రక్తదానం చేయడం వల్ల మనం పొందవచ్చు.

ఎవరు రక్తదానం చేయొచ్చు..

18 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు, వ్యక్తి సగటు 45 కిలోల బరువు ఉండి, 12.5 గ్రా. హిమోగ్లోబిన్ కంటే ఎక్కువ ఉన్న వారెవరైనా రక్తదానం చేయవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. హెచ్ఐవీ, సిఫిలిస్, హెపటైటిస్-బి, సీ, మలేరియా, క్యాన్సర్, హైబీపీ, క్షయ, మూర్ఛ, కరోనా పాజిటివ్ ఉన్న వారు రక్తదానం చేయొద్దు. పురుషులు ప్రతీ మూడు నెలలకు, మహిళలు ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు

అత్యవసర సమయంలో రక్త దానానికి ముందుకు రావాలి.... మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా, రక్తదాత

ఎవరికైనా అత్యవసర సమయంలో రక్తం అవసరం ఉంటే రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ప్రాణాపాయ స్థితిలో రక్తదానం చేస్తే ఆపదలో ఉన్న వారిని కాపాడుకోవచ్చు. కష్టాల్లో ఉన్న వారిని కాపాడుకోవడం కనీస మనిషి ధర్మం. ఇది తెలుసుకుని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు రక్తదానం చేసే విధంగా మేము రక్తదానం చేస్తూ అవగాహన కల్పిస్తున్నాము.

రక్త దానంపై అవగాహన కలిగి ఉండాలి... ఉదయ్ కుమార్, రక్త సంధానకర్త మెట్‌పల్లి

అత్యవసర సమయంలో రక్తదానం చేస్తే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడిన వారము అవుతాము. రక్త దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.. ప్రస్తుత సమాజంలో ఎంతోమంది సకాలంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్న సందర్బాలు సైతం ఉన్నాయి. ఇలాంటి సంఘటనల పై ప్రతి ఒక్కరు స్పందించి స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తే ఒక మనిషికి పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుంది.