రూ. 25 కోట్లతో సిద్దిపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం

రూ. 25 కోట్లతో సిద్దిపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం

  • కోమటి చెరువు కట్టమీద టీటీడీ సహకారంతో త్వరలో నిర్మిస్తాం.
  • పాత రామాలయాన్ని పునర్నిర్మిస్తాం
  •  సిద్దిపేటను ఆలయాల ఖిల్లాగా మారుస్తాం
  • దేవుని కృపతోనే తెలంగాణ వచ్చింది..
  •  అంజన్న కృపతోనే సిద్దిపేట అభివృద్ధి చెందింది..
  • సిద్దిపేటలోని గణేష్ నగర్ హనుమాన్ దేవాలయం వద్ద శ్రీరామ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేట కోమటి చెరువు కట్టమీద తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారి సహకారంతో 25 కోట్ల రూపాయల వ్యయంతో త్వరలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వెల్లడించారు. మంగళవారం సిద్దిపేటలోని గణేష్ నగర్ లో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ రామ కళ్యాణ మండప నిర్మాణానికి మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,సుడా చైర్మన్ మరెడ్డి రవీందర్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కడవెరుగు రాజనర్సు కౌన్సిలర్ కాటం శోభా రఘురాం తదితరులు పాల్గొన్నారు.మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం స్థానిక ఊరిలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నప్పటికీ, టీటీడీ ద్వారా జిల్లా కేంద్రంలో దేవాలయం లేనందున వారిని ప్రభుత్వం తరఫున అడగగా 25 కోట్లతో దేవాలయ నిర్మాణానికి ఇచ్చేందుకు అంగీకరించారని వెల్లడించారు.

దాని నిర్మాణం కోసం ఆరెకరాల స్థలాన్ని కోమటి చెరువు వద్ద తీసుకొని, త్వరలో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.అదే విధంగా సిద్దిపేటలోని ఈశాన్యం మూలన ఉన్న పురాతన రామాలయం శిథిలావస్థలో ఉన్నందున దానిని తిరిగి పున: నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు. పట్టణము దేవాలయాలకు ఖిల్లాగా మార్చి ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తానని చెప్పారు. ఓవైపు జిల్లా రిజర్వాయర్ల కు నిలయంగా మారగా, పట్టణాన్ని ఆలయాల కోటగా చేయడానికి పలు ప్రాంతాల్లో చారిత్రక దేవాలయాలను నిర్మిస్తున్నామని వివరించారు. దేవాలయ ప్రధాన అర్చకులు చిలకమర్రి వెంకటరమణాచార్యులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, పట్టణ వార్డు కౌన్సిలర్లు, సాయన్న గారి సుందర్, నాగరాజు రెడ్డి, పుర ప్రముఖులు బుస శ్రీనివాస్, మధు, శేషు, బాల్రెడ్డి, పెసరరాజు, సత్యనారాయణ, నవీన్, వెంకటాచారి ఇతరులు పాల్గొనగా ఆలయ భక్త బృందం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.