ఫోకస్ తెలంగాణ

ఫోకస్ తెలంగాణ
  • జాతీయ పార్టీ నేతల స్టేట్ టూర్
  • ఈ నెలలోనే రానున్న షా, నడ్డా, మోడీ
  • హైదరాబాద్ లో ప్రధాని రోడ్ షో!!
  • రాహుల్, ప్రియాంక, ఖర్గే షెడ్యూల్ కూడా​
  • పర్యటనలకు ముందే ఢిల్లీలో ఇరు పార్టీల భేటీలు
  • రాష్ట్ర కాంగ్రెస్​ నేతలను హస్తినకు పిలిచిన ఏఐసీసీ
  • పొంగులేటి టీమ్ చేరిక, ఎన్నికల ఫైట్​పై కీలక చర్చలు
  • మీరు కూడా రండి.. బీజేపీ నేతలకు హైకమాండ్ ఆదేశం 
  • ఈటల రాజేందర్ కు కీలక పదవి ఇస్తారనే ప్రచారం
  • ఇతన నేతలకూ ముఖ్య బాధ్యతలు ఇచ్చే అవకాశం!

నవంబర్​వరకు ఎన్నికల షెడ్యూల్​ వస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల నుంచే జాతీయ పార్టీలు రాష్ట్రానికి వచ్చేందుకు షెడ్యూల్​ ఖరారు చేస్తున్నాయి. పార్టీని గాడిలో పెట్టడం, కేడర్​లో ఉత్సాహం నింపేందుకు బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగుతున్నది. ఈ నెల 15న అమిత్​షా రాష్ట్రానికి రానున్నారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. 25న నడ్డా కూడా రానున్నారు. ఈ నెలాఖరున ప్రధాని మోడీ పర్యటన కూడా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్​లో రోడ్​ షో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 
కాంగ్రెస్​ కూడా 25న రాష్ట్రంలో బహిరంగ సభను నిర్వహించే అవకాశాలున్నాయి. రాహుల్​ లేదా ప్రియాంక గాంధీని తీసుకురావాలని భావిస్తున్నారు.

పంచ సూత్రాలతో
కాంగ్రెస్ ఈసారి ప్రధానంగా పలు కీలక అంశాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నది. ఫైవ్ పాయింట్ ఫార్ములాను అమలు చేయాలనుకుంటున్నది. సీనియర్ నేతల మధ్య సమన్వయం కుదర్చడం, పార్టీ నుంచి బయటకు వెళ్లిన నేతలను తిరిగి రప్పించుకోవడం, ప్రజలను ఆకర్షించేలా మేనిఫెస్టో రూపొందించడం, ముఖ్య నాయకులతో రాష్ట్రంలో సభలు ఏర్పాటు చేయడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఎన్నికలను సమాయత్తపరచడం మీద ప్రధానంగా దృష్టి సారించనున్నారు. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మారుతున్న తాజా పరిణామాలను తమ పార్టీకి అనుకూలంగా మార్చకునేలా వ్యూహ రచన చేస్తున్నారు.   

ముద్ర, తెలంగాణ బ్యూరో:
రాష్ట్రంలో జాతీయ పార్టీల నేతల రాజకీయ సందడి మొదలైంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు రాష్ట్రం బాట పట్టారు. పొలిటికల్​ స్పీడ్ పెంచారు. ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్​ షా, పార్టీ  జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు వరుసగా రాష్ట్రానికి రానున్నారు. ఇప్పటి వరకైతే అమిత్ షా, నడ్డా టూర్​ ఖరారైంది. ఈ నెలాఖరుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హైదరాబాద్​లో రోడ్​ షో నిర్వహించే చాన్స్​ఉంది. కాంగ్రెస్​ కూడా వరుస పర్యటనలకు శ్రీకారం చుట్టుతున్నది. ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీతో పాటుగా ఏఐసీసీ చీఫ్ ఖర్గే, ఇతర నేతలు ఏదో ఒక సందర్భంలో రాష్ట్రానికి రానున్నారు. అంతకు ముందు రెండు పార్టీలు ఢిల్లీలో కీలక సమావేశాలను నిర్వహిస్తున్నాయి. 12న రాష్ట్ర కాంగ్రెస్​ నేతలను ఢిల్లీకి రావాలంటూ సమాచారం పంపించారు. బీజేపీ నేతలు కూడా వచ్చేవారం ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి. 

అక్కడే భేటీలు
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జాతీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే కన్నడ ఫలితాలతో ఢీలా పడిన బీజేపీ తెలంగాణపై ఇటీవల కొంత దూకుడు తగ్గించింది. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర నేతల మధ్య బేదాభిప్రాయాలు కేడర్​ను ఆయోమయంలో పడేశాయి. అధిష్టానం పెద్దలు సర్ది చెప్పినా కీలక నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. ఇప్పటికీ ఎవరికి వారుగానే వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో చేరికలకు బ్రేక్ పడింది. సగానికిపైగా సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బీజేపీ అధిష్టానం మళ్లీ రాష్ట్రంపై ఫోకస్ పెడుతున్నది. రాష్ట్ర నేతలను వచ్చేవారం ఢిల్లీకి పిలిచే అవకాశం ఉంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సంజయ్​తోపాటుగా ఈటల రాజేందర్​, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో సమావేశమయ్యే చాన్స్​ఉంది. ఇదే మీటింగ్​లో ఈటలకు కీలక పదవి ప్రకటిస్తారని అంటున్నారు. కాంగ్రెస్​ నేతలు కూడా ఈ నెల 10 లేదా 12న ఢిల్లీ వెళ్లనున్నారు. రాహుల్​గాంధీ అమెరికా పర్యటన తర్వాత వెంటనే రాష్ట్ర నేతలతోనే సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ బలం పెంచుకుంటోందని ఇటీవల సర్వేలలో తేలడంతో, రాష్ట్ర నేతలంతా ఒక్కటై ఎన్నికల బరిలోకి దిగాలని ఏఐసీసీ సూచిస్తున్నది. దీనిలో భాగంగా నేతలకు దిశానిర్దేశం చేసేందుకు ఢిల్లీకి పిలిచారు. 

పొంగులేటి చేరికపైనా డిస్కస్​
బీఆర్ఎస్​ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తమ వర్గీయులతో కాంగ్రెస్​లో చేరేందుకు రంగం సిద్ధమైందని ప్రచారం జరుగుతున్నది. వారికి ఏఐసీసీ నుంచి క్లియరెన్స్​ వచ్చినట్లుగా తెలుస్తున్నది. కొన్ని నియోజకవర్గాలలో టికెట్ల డిమాండ్​కు ఏఐసీసీ ఒకే చెప్పినట్లుగా టాక్​. బీజేపీలో కంటే కాంగ్రస్​లో చేరితేనే బెటర్​ అనే నిర్ణయానికి పొంగులేటి బృందం వచ్చిందని అంటున్నారు. ఇప్పటికే ఎంపీ రేవంత్​రెడ్డి సమక్షంలో రేణుకా చౌదరి, పొంగులేటి, జూపల్లితో పాటుగా నాగర్​ కర్నూల్​కు చెందిన ఓ ఎమ్మెల్సీతో చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ చేరికలపై రాష్ట్ర పార్టీ నేతలతో మరోసారి చర్చించున్నట్లు తెలుస్తున్నది.  ప్రియాంకాగాంధీ ఖమ్మంలో కూడా పర్యటించే అవకాశం ఉంది. పొంగులేటి, జూపల్లి చేరిక ఖరారైన తర్వాత బహిరంగ సభను నిర్వహించే ప్లాన్​ చేస్తున్నారు. నిజానికి, ఇటీవల మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్​ నేతల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. సరైన అభ్యర్థుల ఎంపికతో పాటు నేతల మధ్య ఐక్యత ఉంటే కేసీఆర్‌ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్న ఆత్మవిశ్వాసంతో కాంగ్రెస్ నేతలున్నారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే కొంత ఎడ్జ్ కాంగ్రెస్ వైపు ఉండే అవకాశాలు లేకపోలేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. 

బీజేపీలో మళ్లీ కోవర్టుల కథ
అన్ని పార్టీలలోనూ సీఎం కేసీఆర్ కోవర్టులున్నారంటూ గతంలోనే బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీలోనూ సీఎం కోవర్టులున్నారని ఈటల వెల్లడించారు. అలాంటిందేమి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొట్టిపడేశారు. కోవర్టులున్నారని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఆ తర్వాత ఆ అంశం గురించి ఎవరూ మాట్లాడలేదు. తాజాగా కోవర్టు రాజకీయాల అంశం మళ్లీ తెరపైకి వచ్చాయి. బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఉన్న మాట నిజమేనని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, కీలక నేత నందీశ్వర్ గౌడ్ కీలక కామెంట్స్ చేశారు. వారి పేర్లతో సహా అధిష్ఠానానికి ఫిర్యాదు చేశానని, ప్రస్తుతానికి వారి గురించి చెప్పనని, తీరు మార్చుకోకపోతే మాత్రం మీడియా సాక్షిగా పేర్లు బయట పెడతానని హెచ్చరించారు. మరో 15 రోజులలో సంచలన వార్త వింటారని చెప్పారు. దీంతో ఆయన కాంగ్రెస్​లో చేరుతారని ప్రచారం జరుగుతున్నది.