ప్రజలే నా బలం..బలగం

ప్రజలే నా బలం..బలగం
  • వారి కోసమే సంక్షేమ పథకాలు
  • అమలులో దేశంలో మనమే నంబర్ వన్
  • రైతులకు హక్కుల కోసమే ధరణి
  • ఇది విపక్షాలకు మింగుడు పడడం లేదు
  • వాటిని బంగాళాఖాతంలో కలపాలి
  • నాగర్ కర్నూల్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ 


ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
రాష్ట్ర ప్రజలే తన బలగం, బంధువులని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. వారి కోసమే మేధో మథనం చేస్తూ మానవీయ కోణంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అందుకే దేశంలో నంబర్ వన్ గా నిలిచామని పేర్కొన్నారు. రైతులకు అధికారం కట్టబెట్టేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ను కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇష్టానుసారంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం పలు కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లలో పెద్దనోట్ల రద్దు వల్ల ఒక యేడాది నష్టపోయామన్నారు. కరోనా కారణంగా తీవ్ర సంక్షోభం ఉన్న తరుణంలోనూ తలసరి ఆదాయంలో రాష్ట్రం అగ్రభాగాన నిలిచిందన్నారు. వలసల జిల్లాగా పేరున్న పాలమూరులో గంజి కేంద్రాలు పోయి నేడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ 60 యేండ్లు,  బీజేపీ, టీడీపీ, కలిసి రాష్ట్రాన్ని పదేండ్లు పాలించినా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టలేదన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అనేక పథకాలు వారెందుకు ప్రవేశపెట్టలేదని నిలదీశారు. కాకతీయుల కాలంలో రాష్ట్రంలో ఉన్న 75 వేల చెరువులు, కుంటలు గత పాలకుల వలన ధ్వంసమయ్యాయన్నారు. ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని ప్రవేశపెట్టడంతో నేడు చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని అన్నారు.  జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. 

అందుకే ధరణిని తెచ్చాం:
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొనసాగిన దళారుల ప్రమేయాన్ని అరికట్టేందుకే ధరణి పోర్టల్ ను తీసుకువచ్చామని సీఎం స్పష్టం చేశారు. దీని వలన రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు బిల్లులు వారి ఖాతాలలో నేరుగా జమవుతున్నాయని అన్నారు. ధరణి పోర్టల్ రాకముందు అధికారులు రైతులను అనేక ఇక్కట్లు పెట్టేవారని, నేడు అలాంటిదేమీ లేకుండా ఒకే ఒక్క వేలిముద్రతో అమ్మకం దారి నుండి కొనుగోలుదారులు పేరు మీదికి భూమి మారడంతో పాటు వెంటనే పట్టాదారు పుస్తకం ఇస్తున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో నిరుపేదలకు 4 ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఉచిత కరెంటు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. గిరిజనుల పోడు భూమి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ధరణి సమస్యలు ఉన్న రైతులు ఎమ్మెల్యేలకు, మంత్రులకు వివరిస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తారని అన్నారు. ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం ద్వారా ఆగస్టు నాటికి నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు బహిరంగ సభకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షత వహించారు. మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, విప్ గువ్వల బాలరాజు,  ఎంపీ రాములు, జిల్లా పరిషత్ చైర్మన్ శాంతాకుమారి, ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, గోరటి వెంకన్న, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జైపాల్ యాదవ్, అబ్రహం, కృష్ణమోహన్ రెడ్డి, లక్ష్మారెడ్డి గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు.