సారీ....జెలెన్‌స్కీకి అందుకు అనుమతి ఇవ్వలేం 

సారీ....జెలెన్‌స్కీకి అందుకు అనుమతి ఇవ్వలేం 

లాస్‌ఏంజెల్స్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రారంభించిన దగ్గరి నుంచి ఆ దాడి గురించి అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తున్నారు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ.  అయితే ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ వేదికపై తమ దేశం ఎదుర్కొంటోన్న క్లిష్టపరిస్థితులను ఇంకా ఎక్కువ మంది దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఆయన కల మాత్రం నెరవేరేలా కనిపించడం లేదు. ఈ విషయంలో ఆస్కార్‌ నిర్వాహకుల నుంచి ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి షాక్‌ తగిలింది. ఆ వేదికపై మాట్లాడేందుకు ఆయనకు అనుమతి లభించలేదని అమెరికన్ మీడియా సంస్థ వెల్లడించింది. ఆయనకు ఈ అనుభవం ఎదురుకావడం ఇది వరుసగా రెండోసారి.  ఈసారి వేడుకల్లో జెలెన్‌స్కీ ప్రసంగించేందుకు అనుమతి ఇవ్వాలని అకాడమీ బృందానికి అభ్యర్థన రాగా.. అది కాస్తా తిరస్కరణకు గురైంది. అయితే ఆ తిరస్కరణపై మీడియా ప్రశ్నించగా.. అకాడమీ బృందం స్పందించలేదు. అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు అందుతోన్న మద్దతు తగ్గిపోతున్నట్లు కనిపిస్తోన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 2022 ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగిస్తోంది. దీని గురించి ఎన్నో వేదికలపై స్పందించిన ఆయన.. గతేడాది 64వ గ్రామీ అవార్డుల వేదికపైనా వర్చువల్‌గా మాట్లాడారు.