రేషన్ లో ప్లాస్టిక్ రైస్ ?

రేషన్ లో ప్లాస్టిక్ రైస్ ?
  • ఆందోళనలో లబ్దిదారులు
  • నీళ్లలో తేలుతున్నయి.. పంటికింద సాగుతున్నయి
  • ప్లాస్టిక్ రైసా? పోర్టిఫైడ్ రైసా?

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ ద్వారా లబ్దిదారులకు అందజేస్తున్న బియ్యం ప్లాస్టిక్ రైస్ గా ఉన్నాయంటూ రేషన్ కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  జిల్లా వ్యాప్తంగా పరీశిలిస్తే రేషన్ షాపులోని బియ్యం వండి చూస్తే అవి ప్లాస్టిక్ బియ్యంగా తేలుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అట్టి బియ్యాన్ని వండిన తర్వాత అనుమానం వచ్చి వాటిని కాల్చిన  నేపథ్యంలో ప్లాస్టిక్ ముద్దవలె దగ్గరికి వస్తోందని, నీటిలోనే బియ్యం తేలియాడుతుందని పలువురు పేర్కొంటున్నారు.  

ఇప్పటికే ఆ బియ్యం తిన్నవారి పరిస్థితి ఏంటని రేషన్ షాపు నిర్వహకుడిని నిలదీస్తున్నారు. ఆ క్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యం లోనే ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయా?   రేషన్ షాప్ నిర్వాహకులు  ఆ బియ్యంను కల్తీ చేశారా?  అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మరికొంత మంది అయితే అసలు ఆ బియ్యాన్ని తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. తమకు అలాంటి రైస్ వద్దని అంటున్నారు.  ఇక్కడే కాదు మరికొన్ని ప్రాంతాల్లో సాధారణ రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారని తేలింది.  

రేషన్ బియ్యం వండుకున్న తర్వాత రంగు మారడంతోపాటు జిగురు జిగురుగా ఉందని కొంతమంది చెబుతున్నారు .అయితే ఈ బియ్యాన్ని తిన్న పలువురు లబ్దిదారులు కడుపులో అసౌకర్యం, పొట్టలో పుండ్లు, విరేచనాలు వంటి ఫిర్యాదులు వచ్చినట్లు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సరైన లేబులింగ్ లేకుండా బలవర్థకమైన బియ్యం పంపిణీపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు ప్రజలకు అవగాహన కల్పించక పోగా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవి ప్లాస్టిక్ రైసా? పోర్టిఫైడ్ రైసా(బలవర్దక బియ్యం)? అనే సందేహాలను నివృత్తి చేయడంలో అధికారులు విఫలమయ్యారని స్పష్టమవుతోంది. వీటని తినడం ద్వారా సికిల్-సెల్ అనీమియా, తలసేమియా వంటి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.