ఈ హైవే క్రాసింగ్ కష్టమే

ఈ హైవే క్రాసింగ్ కష్టమే
  • అరచేతిలో ప్రాణాలతో క్రాసింగ్
  • భువనగిరి ఎల్లమ్మ గుడి వద్ద ప్రమాదకరంగా..
  • రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి బైపాస్ లో ఉన్న రేణుక ఎల్లమ్మ గుడి వద్ద హైవే రోడ్డును క్రాస్ చేయడానికి‌ భక్తులకు రోజురోజుకు ఇబ్బందులు పెరుగుతున్నాయి.  సాధారణంగా ప్రతి శని, ఆదివారం ఈ హైవే గుండా వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఆదివారం, మంగళవారం భువనగిరి ఎల్లమ్మ గుడి వద్ద భక్తుల తాకిడి పెద్ద ఎత్తున ఉంటుంది. ఎల్లమ్మ గుడి వద్ద నుంచి కాలినడకన రోడ్డు దాటే ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రదేశంలో  ఫుట్ ఒవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని స్థానికులు  రోడ్డు, రవాణ శాఖ అధికారులకు పలు మార్లు వినతి పత్రాలు అందజేశారు. అధికారులు కూడలి వద్ద తాత్కాలికంగా స్పీడ్ బ్రేకర్ ను ఏర్పాటు చేశారు. ఇది కొంత ఉపశమనం కలిగించిన శాశ్వత మార్గం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న  భక్తులు తిరిగి మరల హైదరాబాదుకు చేరే క్రమంలో హైవే అనుకొని వున్న భువనగిరి ఎల్లమ్మ టెంపుల్,  దాని పక్కనే కొత్తగా ఏర్పాటు చేసిన స్వర్ణ గిరి టెంపుల్ ను దర్శించుకోవడంతో భక్తుల తాకిడి ఎక్కువైంది. దీంతో భక్తులు హైవే రోడ్డును కాలినడకతో దాటుతుండంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎల్లమ్మ టెంపుల్ దేవాలయానికి  సెలవు దినాల్లో భక్తుల తాకిడే ఎక్కువగా ఉంటుందని ట్రాఫిక్ పోలీస్ లు, పెట్రోలింగ్ పోలీసులు అక్కడ  వాహనాలను క్రమబద్ధీకరణ చేయటానికి విధులు నిర్వహిస్తున్నా హైవేపై రోడ్డు క్రాస్ చేసే భక్తులకు అడ్డు చెప్పకపోవడంతో హైవే రోడ్ క్రాస్ చేసే భక్తుల సంఖ్య ఎక్కువ అవుతుంది. భక్తులకు ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు హైవేను క్రాస్ చేయడానికి ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.