ఎన్నికల నియమావళి ని సమర్థవంతంగా అమలు చేస్తాం

ఎన్నికల నియమావళి ని సమర్థవంతంగా అమలు చేస్తాం
  • ఎన్నికల నియమావళి ని సమర్థవంతంగా అమలు చేస్తాం.
  • ఎన్నికల నిర్వహణకు పోలీసు సిబ్బందిని సిద్దం చేశాం.
  • ఇతర శాఖల సమన్వయంతో ప్రణాళిక బద్దంగా విధులు నిర్వహిస్తాం-ఎస్పీ రాహుల్ హెగ్డే

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:సూర్యాపేట జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ రాహుల్ హెగ్డే మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా ప్రతినిధుల పరిచయ కార్యక్రమం అనంతరం ఎస్పీ  మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో మీడియా ప్రతినిధుల బాధ్యత చాలా ఉంటుందని సమన్వయంతో పని చేస్తూ వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో క్రియాశీలకంగా పని చేయాలని కోరారు.జిల్లాలో ఎన్నికల నిర్వహణకు పోలీసు సిబ్బంది సిద్దంగా ఉన్నారనీ, శాంతియుత వాతావరణం లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకునేలా పోలీసు బందోబస్తు నిర్వహిస్తాం అని తెలిపినారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థవంతంగా అమలు చేస్తామని ,పౌరులు బాధ్యతగా నడుచుకోవాలి అని తెలిపినారు. జిల్లాలో 1088 పోలింగ్ కేంద్రాలు ఉండగా 312 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగినదని వీటి వద్ద ఎన్నికల నియమావళి నిబంధనల మేరకు సిబ్బందిని విధుల్లో నియమిస్తామని అన్నారు. చిమీర్యాల, బుగ్గమాదారం, మట్టపల్లి, పులిచింతల ప్రాజెక్ట్, దొండపాడు, మహంకాళిగూడెం, రామాపురం అడ్డ రోడ్ ప్రాంతాల్లో 7 అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ లు, మరో 7 అంతర్ జిల్లా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామని, వీటి తో పాటుగా ఆకస్మిక తనిఖీలు, రైడ్స్ ఉంటాయని తెలిపినారు. నియోజకవర్గాల వారీగా సర్వే లైన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ లు, మండలాల వారీగా ఎంసిసి, స్టాటికల్ టీమ్స్ విధులు నిర్వర్తిస్తారు అన్నారు. తనిఖీల్లో నగదు స్వాధీనం పూర్తి పారదర్శకంగా ఉంటుందనీ, నగదు తీసుకెళ్లడానికి సంభందించి పూర్తి ఆధారాలను కలిగి ఉండాలి అన్నారు.

ఆయుధాలను డిపాజిట్ చేశామని, గతంలో ఎన్నికల్లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై, షీటర్స్ ను ముందస్తు బైండోవర్ చేస్తున్నాం అన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నుండి 1 కోటి 36 లక్షలు సీజ్ చేశామని ,10 తులాల బంగారం, 15 కేజీ ల సిల్వర్ సీజ్ చేశామని, 128.21 లీటర్ల మద్యం, 50 కేజీ ల నల్లబెల్లం, 10 కేజీ పట్టిక, 126 కేజీల గంజాయి సీజ్ చేశాం అన్నారు. అలాగే ఎక్సైజ్ అధికారులతో కలిసి అక్రమ మద్యం సరఫరాను అడ్డుకుంటాం అన్నారు. సోషల్ మీడియా సైట్లను నిశితంగా పరిశీలీస్తున్నాం అని, ఎవరైనా ఇతరుల ను అగౌరవ పరిచేలా, కించపరిచేలా పోస్టింగ్ లు చేసినా తప్పుడు సమాచారం ప్రచారం చేసినా చర్యలు తీసుకుంటాం అని ఎస్పీబీకే రాహుల్ హెగ్డే వివరించారు.