చంద్ర‌కాంత్ పండిట్ చెప్పిందే జ‌రిగింది పుంజుకున్న నైట్ రైడ‌ర్స్ 

చంద్ర‌కాంత్ పండిట్ చెప్పిందే జ‌రిగింది  పుంజుకున్న నైట్ రైడ‌ర్స్ 

ఫ‌లించిన  చంద్ర‌కాంత్ పండిట్ వ్యూహాలు

ఐపీఎల్ రెండో అర్ధ‌భాగం నుంచి త‌మ జ‌ట్టు పుంజుకుంటుంద‌ని  కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు కోచ్ చంద్ర‌కాంత్ పండిట్ ధీమా వ్య‌క్తం చేశారు. త‌న జ‌ట్టుపై అంత‌టి న‌మ్మ‌కాన్ని వ్య‌క్త ప‌రిచారు. ఇది జ‌రిగిన కొన్ని గంట‌ల్లోనే నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు అద్భుత విజ‌యం అందుకుంది. బెంగ‌ళూర్ జ‌ట్టును ఓడించింది. 21 ప‌రుగుల తేడాతో విజ‌యం సొంతం చేసుకుంది. 

జేస‌న్ రాయ్ జోరు

కోచ్ చంద్ర‌కాంత్ పండింట్ ఎన్నో మార్పులు చేర్పులు చేశాడు. ఆట‌తీరును మెరుగుప‌రిచేలా చేశాడు. బ్యాటింగ్ ఆర్డ‌ర్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. ఏప్రిల్ 23న చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుతో జ‌రిగిన‌ మ్యాచులో నైట్ రైడ‌ర్స్ బ్యాట‌ర్ జేస‌న్ రాయ్ అద‌ర‌గొట్టాడు. ఏకంగా 26 బంతుల్లోనే 5 బౌండ‌రీలు 5 సిక్స‌ర్ల సాయంతో 61 పరుగులు చేశాడు. ఆ రోజు జ‌రిగిన మ్యాచులో చెన్నై జ‌ట్టు మొద‌టి బ్యాటింగ్ చేసి 235 ప‌రుగులు చేసింది. 236 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు ఒకానొక‌ద‌శ‌లో ల‌క్ష్యం చేరుకుంటుదా అనే విధంగా బ్యాటింగ్ చేసింది. దానికి ప్ర‌ధాన కార‌ణం జేస‌న్ రాయ్, రింకూ సింగ్ ఇద్ద‌రూ విలువైన భాగ‌స్వామ్యం నెల‌కొలిపారు. ఎప్పుడైతే జేస‌న్ రాయ్ 61 ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యాడో నైట్ రైడ‌ర్స్ ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. 

ఆ రోజు జేస‌న్ రాయ్ జోరును గ‌మ‌నించిన కోచ్ చంద్ర‌కాంత్ పండింట్ జ‌ట్టులో చిన్న‌మార్పు చేయాల‌ని భావించాడు. ఏప్రిల్ 26న జ‌రిగిన మ్యాచులో త‌న ఆలోచ‌న‌ను అమ‌లు చేశాడు. అప్ప‌టి వ‌ర‌కు మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ రూపంలో ఆడిన జేస‌న్ రాయ్ బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్చాడు. ఓపెన‌ర్ అవ‌తారం ఎత్తాడు. కోచ్ సూచ‌న‌లు పాటించాడు. బెంగ‌ళూర్ జ‌ట్టుతో ఆడిన మ్యాచులో జ‌గ‌దీశ్ నారాయ‌న్ తో పాటు ఓపెన‌ర్ గా బ‌రిలో దిగాడు. ప‌వ‌ర్ ప్లే స‌మ‌యంలో వీర‌విహారం చేశాడు. కేవ‌లం 29 బంతుల్లోనే 56 ప‌రుగులు చేశాడు. 4 బౌండ‌రీలు, 5 సిక్స‌ర్ల‌తో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. జ‌ట్టుకు శుభారంభం అందించాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన బ్యాట‌ర్లు ఒత్తిడి లేకుండా ఆడారు. జ‌గదీశ‌న్ 27ప‌రుగులు చేయగా వెంక‌టేశ్ అయ్యర్ 31 ప‌రుగులు చేశాడు. కెప్టెన్ నితీశ్ రాణా 48 ప‌రుగులు చేశాడు. చివ‌ర్లో వ‌చ్చిన రింకూ సింగ్ 18 ప‌రుగులు చేశాడు. దీంతో నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు 200 ప‌రుగులు చేసింది. టాపార్డ‌ర్ బ్యాట‌ర్ జేస‌న్ రాయ్ చిచ్చ‌ర‌పిడుగు వ‌లే చెల‌రేగ‌డంతో నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు భారీ స్కోర్ చేసింది. 201 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన బెంగ‌ళూర్ జ‌ట్టు 179 ప‌రుగుల‌కే ఇన్నింగ్స్ ముగించింది. 21 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాల‌యింది. 

స్పిన్న‌ర్ల మాయాజాలం

నైట్ రైడ‌ర్స్ జ‌ట్టులో ఉన్న ముగ్గురు మిస్ట‌రీ స్పిన్న‌ర్ల‌ను ఎలా వాడుకోవాల‌నే విష‌యంలోను కోచ్ చంద్ర‌కాంత్ పండిట్ ప‌న్నిన వ్యూహాలు ఫ‌లిస్తున్నాయి. ఎంతో నేర్ప‌రిత‌నంలో బ్యాట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టి బౌలింగ్ చేయ‌గ‌లిగే సుయాశ్ శ‌ర్మ‌, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సునీల్ న‌రైన్ జ‌ట్టుకు అండ‌గా నిలుస్తున్నారు. వీరు ముగ్గురు వేస్తున్న 12 ఓవ‌ర్లలో ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేస్తున్నారు. కీల‌క స‌మ‌యంలో వికెట్లు తీస్తున్నారు. ఏప్రిల్ 26న బెంగ‌ళూర్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచులోను అదే జ‌రిగింది. బెంగ‌ళూర్ జ‌ట్టు ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. విరాట్ కోహ్లీ, డ్యూప్లెసిస్ దూకుడుగా ఆడుతున్నారు. ఆ స‌మ‌యంలో సుయాశ్ శ‌ర్మ‌ను బౌలింగ్ చేయ‌డానికి దింపారు. భారీ షాట్ ఆడ‌డానికి ప్ర‌య‌త్నించిన 
డ్యూప్లెసిస్ దొరికిపోయాడు. సుయాశ్ శ‌ర్మ బౌలింగ్ లో ఔట‌య్యాడు. 17 ప‌రుగుల‌కే వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన షాబాజ్ అహ్మ‌ద్ ను కూడా సుయాశ్ శ‌ర్మ ఔట్ చేశాడు. షాబాజ్ 2 ప‌రుగుల వ‌ద్ద వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత బౌలింగ్ ప్రారంభించిన వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి మ్యాక్స్ వెల్, మ‌హిపాల్, దినేశ్ కార్తీక్ వికెట్లు ప‌డ‌గొట్టాడు. నైట్ రైడ‌ర్స్ స్పిన్న‌ర్ల ధాటికి బెంగ‌ళూర్ టాపార్డ‌ర్, మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు ఖంగుతిన్నారు. ఆ విధంగా కోచ్ చంద్ర‌కాంత్ పండిట్ చేస్తున్న మార్పులు మంచి ఫ‌లితాల‌ను అందిస్తున్నాయి. రానున్న రోజుల్లో నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు మ‌రిన్ని విజ‌యాలు సాధిస్తుంద‌ని కూడా ఆ జ‌ట్టు అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.