27 నుంచి  31వ ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్

27 నుంచి  31వ ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్
హైటెక్స్ ఎన్ఎసి క్యాంపస్ సమావేశ హాలులో గురువారంనాడు 31వ ఆలిండియా బిల్డర్స్ అసోసియేషన్ సమ్మేళనానికి సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించిన కన్వెన్షన్ కమిటీ జాతీయ అధ్యక్షుడు ఎస్.ఎన్. రెడ్డి, చిత్రంలో ఆయనతోపాటు అర్గనైజేషన్ కమిటీ చైర్మన్ బొల్లినేని శీనయ్య, హైదరాబాద్ సెంటర్ చైర్మన్ భూపిందర్ సింగ్, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ కె. దేవేందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎన్ సచ్చిదానంద రెడ్డి, వైస్ చైర్మన్ బి. సుగుణాకరరావు కూడా ఉన్నారు.

హైటెక్స్ లో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి 

ముద్ర న్యూస్​బ్యూరో, హైదరాబాద్​ : బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ 31వ సదస్సు  (ఏఐబీసీ) 2024 హైదరాబాద్ వేదికగా జరగనుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ లోని హాల్ నెంబర్ 2లో  ఈ  నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న  ఈ సదస్సుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.    ఇందుకు సంబంధించిన  బీఏఐ , ఏఐబీసీ నిర్వహకులు గురువారం  ఎన్​ఏసీ  క్యాంపస్ లో పోస్టర్ ను ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా ఆలిండియా బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ఎన్  రెడ్డి మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాలలో పర్యటించి కాంట్రాక్టర్ల సమస్యలను అధ్యయనం చేశానన్నారు.  టెండర్లు, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల విషయంలో ఒక నిర్ది్ష్టమైన ప్రభుత్వ విధానం లేకపోవడమే  కాంట్రాక్టర్ల  సమస్యలకు మూలకారణం అవుతోందని ఆయన తెలిపారు.  ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టులు పొందడం విషయంలో సానుకూల పరిస్థితులు లేకపోవడం,  అప్పగించిన కాంట్రాక్టు పనులు పూర్తిచేసినా గానీ బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం కావడం వంటి సమస్యలు తమను ఆర్థికంగా కుంగదీస్తున్నాయని ఆయన వివరించారు. ఈ రకమైన సమస్యలను మిగిలిన రాష్ట్రాల కంటే పదేళ్ల  కాలంలోతెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా ఎదుర్కొంటూ వస్తున్నామని ఆయన తెలిపారు. సమస్యలను గురించి చెప్పుకోవాలంటే గత ప్రభుత్వ కాలంలో అసలు ముఖ్యమంత్రి అపాయంట్ మెంటే దొరకలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే జీఓ నం. 25 ద్వారా కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇటువంటి సమస్యలు దేశవ్యాప్తంగా ఎక్కడా చోటుచేసుకోకుండా ఉండేందుకు  ప్రధానమంత్రి నరేంద్రమోడీ భావాలకు అనుగుణంగా ‘కామన్  కాంట్రాక్ట్  డాక్యుమెంట్’ అనే విధానాన్ని జాతీయస్థాయిలో అమలులోకి తెస్తే సరిపోతుందని,  ఈ విధానం అమలుకోసం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ప్రధాని దృష్టికి తెస్తామని ఎస్ఎన్ రెడ్డి తెలిపారు. కన్వెన్షన్  ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బొల్లినేని శీనయ్య మాట్లాడుతూ.. అసోసియేషన్ జాతీయ సమ్మేళనం తొలి కార్యక్రమాన్ని 2016లో హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించామని గుర్తుచేశారు.  ఏ రాష్ట్రంలోనైనాగానీ అటు ప్రభుత్వానికి, ఇటు కాంట్రాక్టర్ల కార్యకలాపాల రంగానికి మధ్య సంధానకర్తగా వ్యవహరించే తమ ఆలిండియా బిల్డర్స్ అసోసియేషన్ కార్యకలాపాలు అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంలోనూ అస్పష్ట విధానమేనని,  ఎలాగోలా పనులు తెచ్చుకుని పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.  ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచే  మూడేళ్ల కాలంగా సుమారు పదివేల కోట్ల రూపాయల మేరకు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్. సచ్చిదానందరెడ్డి మాట్లాడుతూ ప్రతి రెండేళ్లకు ఒకసారి అసోసియేషన్ జాతీయ సమ్మేళనం జరుగుతుందని, ఒక్కోసారి ఒక్కో రాష్ట్రంలో నిర్వహిస్తు వస్తున్నామని, ఈసారి హైదరాబాద్​లో నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి దేశం నలుమూలల నుంచి వేలాదిమంది అసోసియేషన్ సభ్యులు,  కాంట్రాక్ట్  కార్యకలాపాల నిపుణులు,  అనుభవజ్ఞులైన బిల్డర్లు, నిర్మాణరంగానికి సంబంధించిన ప్రముఖులు విచ్చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర  చైర్మన్ కె. దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ మూడురోజుల జాతీయ సమ్మేళనంలో స్మార్ట్ సిటీ,  పర్యావరణ పరిస్థితులు, లేబర్ కార్యకలాపాలు, మట్టి, గ్రానైట్  తరలింపు సమస్యలపై ప్రధానంగా చర్చిస్తామని తెలిపారు.
 ఇదిలా ఉండగా   ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ ను శనివారం సాయంత్రం  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతర్ రెడ్డి ప్రారంభించనున్నారని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) జాతీయ అధ్యక్షుడు ఎస్.యన్.రెడ్డి, బీఏఐ మాజీ జాతీయ అధ్యక్షుడు బొల్లినేని శీనయ్య,  రాష్ట్ర అధ్యక్షుడు  కె.దేవేందర్ రెడ్డి వివరించారు. గౌరవ అతిథులుగా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి,  సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిహాజరవుతారన్నారు.  మూడు రోజుల పాటు  జరగనున్న సదస్సులో 800 వందల మందికి పైగా హాజరవుతారన్నారు.  ఈ సదస్సస్సులో  నిర్మాణ రంగంలో అధునాతన టెక్నాలజీ వంటి పలు అంశాల పై సెమినార్లు , టెక్నికల్ సెషన్స్ జరుగుతాయని వారు తెలిపారు. ఎగ్జిబిషన్ , వర్క్ షాప్స్ , అధునాతన నిర్మాణ పరికరాలను, నిర్మాణ మెటీరియల్  వంటి విషయాలపై   కమిటీ చర్చించనుందని వారు వివరించారు.ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎన్ సచ్చిదానంద రెడ్డి, బీఏఐ మెంబర్స్  కమిటీ చైర్మన్ డి.వి.యన్ రెడ్డి, హైదరాబాద్ సెంటర్ చైర్మన్ భూపేందర్ సింగ్, కన్వెన్షన్ వైస్ చైర్మన్  బల్మూరి  సుగుణాకర్ రావు , కన్వెన్షన్ ఫైనాన్స్  కమిటీ చైర్మన్ సంకినేని కృష్ణారావు, కోశాధికారి నరేందర్ రెడ్డి,  కన్వెన్షన్ జాయింట్ సెక్రటరీ వి.సుధాకర్ లతో పాటు   మెమెంటోస్ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్  రెడ్డి,  ఫుడ్ కమిటీ వి.భాస్కర్ రెడ్డి, రిజిస్ట్రేషన్ కమిటీ జి.సంతోష్ రెడ్డి  పలువురు పాల్గొన్నారు.

కార్యక్రమ వివరాలు

ఈనెల 27 సాయంత్రం 5.30 గంటలకు హైటెక్స్ ఎన్ ఏసీ  క్యాంపస్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభిస్తారు. రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , రాష్ట్ర రోడ్లు, భవననిర్మాణ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి డి. అనసూయ సీతక్క, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గౌరవ అతిథులుగా   హాజరవుతారు. అదేవిధంగా 28న ఉదయం 10,30 గంటలకు సదస్సులోని సాంకేతిక విభాగం సమావేశానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా విచ్చేసి సమావేశంలో ప్రసంగిస్తారు. ఇక 29 న ఉదయం 11.30 గంటలకు మూడోరోజు సదస్సు  ముగింపు కార్యక్రమానికి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా, కేంద్ర సమాచారశాఖ సహాయ మంత్రి దేవుష్ చౌహాన్ గౌరవ అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తారు. కాగా ఈ మూడురోజుల సదస్సులో ఆలిండియా బిల్డర్స్ అసోసియేషన్ కమిటీతోపాటు సదస్సు నిర్వాహక కమిటీ కార్యవర్గమంతా హాజరై సదస్సు కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.