ఆమె ఓటు కోసం  అందరి పాట్లు!

ఆమె ఓటు కోసం  అందరి పాట్లు!
  • 74 సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే ఎక్కువ
  • గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే!
  • మహిళా ఓటర్ల ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల వ్యూహాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మహిళా చైతన్యం వెల్లివిరిస్తోంది. నిన్నటి వరకు వంటింటికే పరిమితమైన మహిళల్లో సామాజిక స్పృహ పెరుగుతోంది. ఆకాశంలో సగం.. అవకాశాల్లో మనం అనే నినాదంతో దూసుకెళ్తోన్న అతివలు రాజకీయాలపైనా తమదైన ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు. మహిళా సాధికారిత కోసం పాటుపడేవారిని గెలిపించేందుకు ఉద్యమంలా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈనెల 4న విడుదలైన ఓటర్ల జాబితాలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు ఉంటే.. అందులో 1,58,71,493 మంది పురుషులు, 1,58,43,339 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే.. 74 సెగ్మెంట్లలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మహిళా ఓటర్ల తీర్పే కీలకం కానుంది. అతివలలు ఎవరిని ఆదరిస్తే.. వారే ఎమ్మెల్యేలు కానున్నారు. దీంతో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లలో ‘ఆమె’ను ప్రసన్నం చేసుకునేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వార్డులవారీగా మహిళా సంఘాల సభ్యులు, ఉమ్మడి కుటుంబాల వివరాలు సేకరిస్తున్నారు.

మహిళా ఓటర్లు అధికంగా ఉన్న సెగ్మెంట్లు..

ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలైన చెన్నూరు, బెల్లంపల్లి, జుక్కల్, ధర్మపురి, చొప్పదండి, మానకొండూరు, ఆంధోల్, వికారాబాద్, ఆలంపూర్, స్టేషన్​ ఘన్ పూర్, నకిరేకల్, వర్ధన్నపేట, మధిర, సత్తుపల్లి, ఎస్టీ స్థానాలైన ఆసిఫాబాద్, ఖానాపూర్​(ఎస్టీ) బోథ్, డోర్నకల్, మహబూబాబాద్, ములుగు, పినపాక, ఇల్లందు, వైరా, అశ్వరావుపేట, భద్రాచలం సెగ్మెంట్లలో మహిళా ఓటర్ల తీర్పే కీలకం కానుంది. ఇటు జనరల్ స్థానాలైన ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్​రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల, మంథని, పెద్దపల్లి, వేములవాడ, సిరిసిల్ల, హుజూరాబాద్, హుస్నాబాద్​, సిద్దిపేట, మెదక్​, నర్సాపూర్​, సంగారెడ్డి, దుబ్బాక, గజ్వేల్, తాండూరు, కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్​, దేవరకద్ర, మక్తల్, గద్వాల, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగామ, మంచిర్యాల, నర్సంపేట, పరకాల, వరంగల్​వెస్ట్, వరంగల్​ఈస్ట్, భూపాలపల్లి, ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు.

80 ఏండ్లు దాటితే ఇంటి నుంచే ఓటు
వందేళ్లు దాటిన ఓటర్లు 7,600 మంది ఉన్నారు
హైదరాబాద్ మినీ భారత్ లాంటింది
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో తొలిసారిగా 80 ఏండ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫామ్ 12డీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని, ఇక్కడ అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉన్నారన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌న్నాహ‌కాల‌ స‌మీక్ష కోసం రాష్ట్రానికి వ‌చ్చిన కేంద్ర ఎన్నికల సంఘం  పర్యటన గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజీవ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు  కాగా అందులో వందేళ్లు దాటిన ఓటర్లు 7,600 ఉన్నారన్నారు. రాష్ట్రంలో స్త్రీ, పురుష ఓట‌ర్లు దాదాపు స‌మానంగా ఉండ‌టం శుభ ప‌రిణామమని, యువ ఓట‌ర్ల సంఖ్య 8 లక్షలు దాట‌డం ప్రశంసించదగ్గ విష‌య‌మ‌న్నారు. 2022–23 ఏడాదిలో 22 లక్షలకు పైగా ఓట్లను ప‌రిశీలించి తొల‌గించామని, అయితే వీటిని ఏక‌ప‌క్షంగా తొల‌గించ‌లేద‌ని ఆయన స్పష్టం చేశారు. ఫామ్ అందిన త‌ర్వాతే ఓట్లను తొల‌గించిన‌ట్లు పేర్కొన్నారు.

2.21 ల‌క్షల యువ‌త‌కు ఓటు హ‌క్కు క‌ల్పించాం..

జూలై త‌ర్వాత ద‌ర‌ఖాస్తు చేసుకున్న 2.21 ల‌క్షల యువ‌త‌కు ఓటు హ‌క్కు క‌ల్పించామ‌ని రాజీవ్ కుమార్​అన్నారు. 66 నియోజ‌క‌వ‌ర్గాల్లో పురుషుల కంటే మ‌హిళా ఓట‌ర్లే అధికంగా ఉన్నారని 18 నుంచి 19 ఏండ్ల యువ మ‌హిళా ఓట‌ర్లు 3.45 ల‌క్షలు ఉన్నార‌ని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేష‌న్లు 35,356 ఉండ‌గా, ఒక్కో పోలింగ్ స్టేష‌న్ లో స‌గ‌టు ఓట‌ర్ల సంఖ్య 897గా ఉంద‌న్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నిక‌ల సన్నాహాల్లో భాగంగా అన్ని పార్టీల ప్రతినిధులతో స‌మావేశాలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఆయా పార్టీల సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను స్వీక‌రించామ‌న్నారు. ఎన్నిక‌ల ఖ‌ర్చు పెంచాల‌ని కొంద‌రు అడిగార‌న్నారు. ఇక ఫిర్యాదుల స్వీక‌ర‌ణ కోసం సీ విజిల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని రాజీవ్ కుమార్ తెలిపారు. దీనిపై గంటన్నర వ్యవధిలోనే  తగు చర్యలు ఉంటాయని తెలిపారు.