అమ్మో..  టీ కాంగ్రెస్!

అమ్మో..  టీ కాంగ్రెస్!
  • హస్తినను హడలెత్తిస్తున్న టీ కాంగ్రెస్​ రాజకీయాలు
  • టికెట్ల అమ్మకం ఆరోపణలపై ఏఐసీసీ సీరియస్
  • టీపీసీసీ చీఫ్  సహా మరో ఇద్దరిపై ఆరోపణలు
  • టిక్కెట్ల కోసం పట్టుబడుతున్న నేతల కదలికలపై నిఘా!
  • పలువురు సీనియర్లను కలిసేందుకు టైమివ్వని అగ్రనేతలు
  • రాష్ట్ర వ్యవహారాల్లో తలదూర్చని ఖర్గే?
  • తెలంగాణకు వస్తా.. అక్కడే మాట్లాడదామంటున్న రాహుల్!
  • నిరాశతో వెనుదిరుగుతున్న సీనియర్లు


టీ కాంగ్రెస్​రాజకీయాలు ఏఐసీసీ అగ్రనేతలను హడలెత్తిస్తున్నాయి. ఓ వైపు బీసీ, ఎస్టీ వర్గ నేతలతోపాటు పలువురు సీనియర్లు టిక్కెట్ల కోసం పట్టుబడుతుంటే.. మరోవైపు టిక్కెట్లు ఇప్పిస్తామంటూ పలువురు సీనియర్లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారంపై ఏఐసీసీ అప్రమత్తమైంది. మొన్నటి వరకు పార్టీలో సీట్లు అమ్ముకున్నారంటూ టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డిపై ఆరోపణలు వినిపించగా తాజాగా ఆయన ఏకంగా పోర్ట్ ఫోలియోలనే అమ్ముకుంటున్నారంటూ ఆ పార్టీ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని నమ్మిస్తున్న రేవంత్ రెడ్డి.. రెవెన్యూ మంత్రి పదవి ఇప్పిస్తానంటూ గాలి అనిల్ కుమార్ వద్ద రూ.12 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నట్టు మనోహర్​రెడ్డి ఆరోపించారు. 

రంగంలోకి రాహుల్​గాంధీ

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రాహుల్ గాంధీ స్వయంగా రంగంలో దిగినట్లు సమాచారం. వివాదరహిత నేతలతో సంప్రదింపులు జరుపుతున్న ఆయన.. రాష్ట్ర రాజకీయాల గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నేతల భేటీకి ఖర్గే సమయమివ్వకపోవడంతో పలువురు నేతలు ఏకంగా రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో తానే తెలంగాణకు వస్తానని.. అక్కడే విషయాలన్నీ మాట్లాడుకుందామని రాహుల్ ఆయా నేతలతో స్పష్టంగా చెబుతున్నట్లు కాంగ్రెస్​ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. దీంతో టిక్కెట్ల ఖరారు కోసం ఢిల్లీకి వెళ్తోన్న సీనియర్లు, ఆశావాహులు నాలుగైదు రోజులు వేచిచూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : టీ కాంగ్రెస్​లో టికెట్లు అమ్ముకుంటున్నారని వస్తున్న ఆరోపణలతో కాంగ్రెస్​హైకమాండ్​సీరియస్​అయ్యింది. ఈమేరకు తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలంగాణలో అసలేం జరుగుతుందోనని ఏఐసీసీ ఆరా తీసే పనిలో పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో భాగంగా వివాదాస్పద నేతల కదలికలపై అగ్రనేతలు దృష్టిపెట్టారనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో సీట్లు అమ్ముకున్నారంటూ టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్​బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి ఆరోపణలు, అలాగే ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం తన అనుచరులకు 11 టిక్కెట్లు డిమాండ్ చేయడం టీ కాంగ్రెస్​లో తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు టీ నేతల తీరుపై అసంతృప్తితో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. తెలంగాణకు సంబంధించిన టిక్కెట్ల వ్యవహారంపై అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను కలిసి టిక్కెట్లు అభ్యర్థిద్దామని ఢిల్లీకి వెళ్తోన్న ఆశావాహులు, పలువురు సీనియర్లను కలిసేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. టిక్కెట్ల కేటాయింపులో అర్హత కలిగిన తమ లాంటి వారికి అన్యాయం జరుగుతుందని.. ఆ విషయం నేరుగా ఏఐసీసీ నేతలకు చెప్పేందుకు ఢిల్లీకి వస్తే ఎవరూ అపాయిట్​మెంట్ ఇవ్వడం లేదని ఉమ్మడి కరీంనగర్​ జిల్లాకు చెందిన ఓ నాయకుడు ‘ముద్ర’ తో తన ఆవేదన వెలిబుచ్చారు. తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై నిగ్గు తేల్చేందుకు రాహుల్ గాంధీ మరో రెండు వారాల్లో తెలంగాణకు వస్తారని మరో నాయకుడు వివరించారు.

టిక్కెట్లపై ఉత్కంఠ..!

టీ కాంగ్రెస్ టిక్కెట్ల ప్రకటనలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన టీపీసీసీ.. పలు నియోజకవర్గాల్లో వారిని కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు ఖరారు చేసిందంటూ వస్తోన్న ప్రచారం పలువురు సీనియర్లలో ఆందోళనకు గురి చేస్తోంది. మైనంపల్లికి మల్కాజిగిరి, ఆయన కుమారుడు రోహిత్ కు మెదక్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పాలేరు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కొత్తగూడెం, జూపల్లి కృష్ణారావుకు కొల్లాపూర్, అజ్మీరా రేఖకు ఖానాపూర్, ఆమె భర్త శ్యాం నాయక్​ కు ఆసిఫాబాద్​టిక్కెట్లు ఖరారయ్యాయనే చర్చ జరుగుతోంది. మరోవైపు బీసీలు 34, ఎస్టీలు 15 స్థానాల్లో టిక్కెట్ల కోసం పట్టుబడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు పలువురు సీనియర్లు సైతం తమ అనుచరులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు శర్వశక్తులొడ్డుతున్నారు. దీంతో ఇప్పటికే టిక్కెట్లు ఖరారు చేసేందుకు తర్జనభర్జన పడుతున్న ఏఐసీసీ ఈ విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తోంది.