హైదరాబాద్ లో ఐటీ దాడులు

హైదరాబాద్ లో ఐటీ దాడులు
  • బడా వ్యాపారులు, కాంట్రాక్టర్ల ఇళ్లు, ఆఫీసుల్లో అధికారుల సోదా
  • జూబ్లీహిల్స్ ​ఎమ్మెల్యే గోపీనాథ్ సోదరుడి ఇంట్లో తనిఖీ 

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ.. ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టడం, పన్ను ఎగవేత తదితర అంశాలపై ఐటీ శాఖ దృష్టి సారించింది. గురువారం హైదరాబాద్ లోని పలు కంపెనీలతోపాటువాటి యజమానుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 100 బృందాలు పాల్గొన్నట్లు సమాచారం. 

నగర శివారు ప్రాంతాల్లో సోదాలు..

హైదరాబాద్ తో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరిగాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తోపాటు ఎల్లారెడ్డి గూడలోని ఆయన సోదరుడు వజ్రనాథ్ నివాసాల్లోనూ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. కూకట్ పల్లిలోని హిందూ పార్చ్యూన్ లో, అమీర్ పేటలోని పూజా కృష్ణ చిట్ ఫండ్ కార్యాలయం, ఆ సంస్థ యజమాని నివాసం, వ్యాపారవేత్తలు ప్రసాద్, కోటేశ్వర రావు, రఘువీర్ ఇండ్లలో తనిఖీలు జరిగాయి. గత జూన్ నెలలో హైదరాబాద్‎లో ఐటీ అధికారులు రూ.40 కోట్ల స్కామ్ ను బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. అందులో 8 మంది ట్యాక్స్ కన్సల్టెంట్లు, రైల్వేలు, పోలీసు శాఖలకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు నాడు గుర్తించారు. ఈ- కామ్ కంపెనీ మేనేజర్ రఘువీర్ గత ఐదేళ్లుగా దాఖలు చేసిన ఐటీ రిటర్నులపై ఐటీ శాఖ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేత కేసులో 10 మంది కాంట్రాక్టర్ల ఇళ్లలో సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. సీఆర్ఫీఎఫ్ బందోబస్తు మధ్య దాడులు ఐటీ శాఖ అధికారులు దాడులు కొనసాగాయి. దీంతోపాటు శంషాబాద్, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్ లోని పలు చిట్ ఫండ్స్ , ఫైనాన్స్ కంపెనీల్లోనూ సోదాలు జరిగాయి. చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించిన ఫైల్స్, బ్యాంక్ ఖాతాలు, ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.