రూ.8.5 కోట్లు హాంఫట్..

రూ.8.5 కోట్లు హాంఫట్..
  • నర్సంపేట ఐసిఐసిఐ బ్రాంచ్ లో డిప్యూటీ మేనేజర్ చేతివాటం
  • ఖాతాదారులు బంగారం రుణం పొందినట్లు కలరింగ్
  • ఆడిటింగ్ లో బట్టబయలు

ముద్ర ప్రతినిధి, వరంగల్: నర్సంపేట ఐసిఐసిఐ బ్యాంక్ లో డిప్యూటీ మేనేజర్ చేతివాటం ప్రదర్శించారు. ఏకంగా రూ. 8.5 కోట్ల తో బ్యాంకును బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. ఆడిటింగ్ లో డిప్యూటీ మేనేజర్ బైరీ శెట్టి కార్తీక్ బాగోతం బయటపడింది. 

ఖాతాదారులు రుణాలు పొందినట్లు కలరింగ్..
బ్యాంకులోని నగదును దోచేందుకు డిప్యూటీ మేనేజర్ బైరిశెట్టి కార్తీక్ పకడ్బందీ వ్యూహాన్ని రచించారు. ఖాతాదారులు బంగారం పేరిట రుణాన్ని పొందినట్లుగా బ్యాంకు అధికారిక వివరాల్లో నమోదు చేశారు. ప్రతి ఏడాది బ్యాంకులో నిర్వహించే ఆడిటింగ్.. ఇటీవల ఈ ఏడాది కూడా నిర్వహించారు. ఫలితంగా ఖాతాదారుల రుణాలకు సంబంధించినవి వివరాలు, బంగారం నిలువల్లో మధ్య తేడాలు స్పష్టంగా కనిపించాయి. ఆడిటింగ్, బ్యాంక్ అధికారులు లోతైన విచారణ చేయడంతో డిప్యూటీ మేనేజర్ చేతివాటం బహిర్గతమైంది. మొత్తం రూ.8.5 కోట్లు పక్కదారి పట్టినట్లుగా తమ ఆడిటింగ్ ఆడిటింగ్ లో నిగ్గు తేల్చారు. రీజినల్ హెడ్ ఓరుగంటి శ్రీనివాస్ నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

128 ఖాతాలు వినియోగించి..
డిప్యూటీ మేనేజర్ కార్తీక్ నగదును చేజిక్కించుకునేందుకు బ్యాంకులోని 128 ఖాతాలను వినియోగించినట్లు తెలుస్తోంది. రీజినల్ హెడ్ ఓరగంట శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం నిందితుడు కార్తీక్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బ్యాంకులో జరిగిన మోసం ద్వారా ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని సిఐ రవికుమార్ తెలిపారు. ఎవరికైనా సందేహాలు ఉంటే బ్యాంకు, పోలీస్ స్టేషన్లో సంప్రదించవచ్చని సూచించారు.