ఆలయం పై కొండ చరియలు పడటంతో 9 మంది మృతి..

ఆలయం పై కొండ చరియలు పడటంతో 9 మంది మృతి..

సోమవారం హిమాచల్‌ ప్రదేశ్‌ లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పక్కనే ఉన్న ఆలయంపై పడ్డాయి. దీంతో దేవాలయానికి వచ్చిన వారిలో సుమారు 9 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.  ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రం అతలాకుతల మవుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న కుంభ వృష్టికి పలు చోట్ల ప్రమాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  సోమవారం శిమ్లా లోని ఓ ఆలయం పై కొండ చరియలు విరిగి పడి 9 మంది మృతి చెందారు. సోమవారం ఉదయం సమ్మర్‌ హిల్‌ ప్రాంతం లోని శివాలయం పై కొండ చరియలు విరిగి పడ్డాయి. కొండ చరియల ధాటికి ఆలయం కుప్ప కూలింది. శిథిలాల కింద పదుల సంఖ్యలో భక్తులు చిక్కుకు పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 9 మృత దేహాలను వెలికి తీసినట్టు అధికారులు ప్రకటించారు. శిథిలాల కింద మరో 20 మందికి పైనే ఉన్నట్లు చెబుతున్నారు. నేడు శ్రావణ సోమవారం కావడంతో ఉదయం నుంచే శివాలయానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ప్రమాద సమయంలో ఆలయం వద్ద దాదాపు 50 మంది వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు..