ముట్టడి.. కట్టడి.!

ముట్టడి.. కట్టడి.!
  • కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు
  • ఎంజీఎం సెంటర్ లో బైఠాయించిన శ్రేణులు
  • నాయిని సహా పలువురు నాయకుల అరెస్టు
  • వరంగల్ గ్రేటర్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ యత్నం

ముద్ర ప్రతినిధి, వరంగల్: అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్, వరద బాధితులకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. గ్రేటర్ కార్యాలయ ముట్టడి చేపట్టిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో గ్రేటర్ కార్యాలయం వైపు దూసుకొచ్చారు. హనుమకొండ కాంగ్రెస్ జిల్లా కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి ఎంజిఎం చౌరస్తా సెంటర్ కు రాగానే.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనుమతి లేదంటే ముట్టడిని విరమించుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు రోడ్డు పైన బైఠాయించి నిరసనకు దిగారు. గ్రేటర్ కార్యాలయానికి అనుమతించాలంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు.

నిరసన విరమించుకోవాలని సూచించారు. పోలీసుల సూచనలను పట్టించుకోకపోవడంతో అప్పటికే భారీ ఎత్తున మోహరించిన బలగాలతో నాయకులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల నిర్వహించే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. తోపులాట మధ్య హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, రిటైర్డ్ పోలీస్ కమిషనర్ కె.ఆర్ నాగరాజు, ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్ కు తరలించేందుకు పోలీసుల వాహనాల్లో ఎక్కించిన తర్వాత కార్యకర్తలు వాహనాలను అడ్డుకున్నారు. కార్యకర్తలను పోలీసులు బలవంతంగా ఈడ్చిపడేసి అరెస్టు అయిన నాయకులను స్టేషన్కు తరలించారు. 

కాంట్రాక్టుల పై శ్రద్ధ కాలనీలపై లేదు.. రిటైర్డ్ సి పి కే ఆర్ నాగరాజు
వరంగల్ నగర ప్రాంత ఎమ్మెల్యేలకు కాంట్రాక్టులు ల్యాండ్ మాఫియా పై ఉన్న శ్రద్ధ.. వరదలతో మునుగుతున్న కాలనీ ప్రజలపై మాత్రం లేదన్నారు. వరద నీటిలో మునిగి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే వారి ఆదుకోవడం లేదని, వెంటనే తక్షణసాయంగా రూ.10 వేలను పరిహారంగా అందించాలని డిమాండ్ చేశారు.  

అడ్డగింత దుర్మార్గం.. నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
ప్రజా సమస్యలు పరిష్కరించమని.. నిరసన తెలిపితే అరెస్టు చేయడం సరికాదన్నారు. వరదలతో నష్టపోయిన బాధితులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలన్నారు.