85.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన: మంత్రి సత్యవతి రాథోడ్

85.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన: మంత్రి సత్యవతి రాథోడ్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్రంలో  కే.సి.ఆర్ ప్రభుత్వంలో గిరిజనులకు ఒక స్వర్ణ యుగమని రాష్ట్ర గిరిజన అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.  మంగళవారం రాష్ట్ర మంత్రి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననుర్, గిరిజన తండాల్లో పర్యటించి 85.5 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థపనలు చేశారు.  దీనితో పాటు సి.టి.డి. ఎ ద్వారా చెంచుల జీవనోపాధి కై 250 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల విలువ చేసే యూనిట్లను అందజేశారు.  అదేవిధంగా ఆర్.డి.టి ద్వారా 250 కుటుంబాలకు లక్ష రూపాయల విలువ గల యూనిట్లను పంపిణీ చేశారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్ లో చెంచులక్ష్మి రెస్టారెంట్, గిరిజనాభివృద్ధి శాఖ ద్వారా రు. 90 లక్షల వ్యయంతో నిర్మించిన  వ్యాధి నిర్ధారణ కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు. చెంచులకు  న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసిన మంత్రి జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం షెడ్యూల్డ్ ట్రైబ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి రు. 2.25 కోట్ల అంచనాలతో చెంచుపల్గు తాండా నుండి లక్ష్మాపూర్ వరకు 2.4 కి.మి. బి.టి రోడ్డు, లక్ష్మాపుర్ నుండి శంకరయ్య గుట్ట తాండకు 105 లక్షలతో బి.టి రోడ్డుకు శంఖుస్థాపన చేశారు.  తండాలో వారి సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా లంబాడీ మహిళలతో కలిసి నృత్యం చేసి ఉత్సాహపరిచారు.

జాజల తాండా బి.టి రోడ్డుకు 120 లక్షలు, సర్వరెడ్డి పల్లి తాండా కు 175 లక్షలు, దాస్య తండా కు 105 లక్షలు గుట్టమీద 70 లక్షలు రెసిడెన్షియల్ స్కూల్ కాంగ్రెస్కు 500 లక్షల రూపాయలు బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు అదేవిధంగా చెంచుల స్వయం ఉపాధి వారి ఆర్థిక సాధికారత కొరకు   అమరగిరి ఫిష్ స్టోరేజ్ యూనిట్ 35 లక్షలు ఎల్గూర్ ఫిష్ స్టోరేజ్ యూనిట్ కు 35 లక్షలు, రేకుల వలయం ఫిష్ స్టోరీజ్ కు 35 లక్షలు, చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ కు 5.5 లక్షలు, హాని యూనిట్ 2.70 లక్షల విలువ గల యూనిట్లను పంపిణీ చేశారు.  అనంతరం అచ్చంపేట శ్యామ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ స్వతంత్రం వచ్చాక 67 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాలు ఒక ఎత్తు అయితే కేవలం 9 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఒక ఎత్తు అన్నారు. అందుకే గిరిజనులకు ఈ 9 సంవత్సరాలు స్వర్ణయుగం లాంటిది అన్నారు.  ఆడపిల్ల పుడితే గిరిజనులు పేదరికంతో పెళ్ళిలు చేయలేక పోషించలేక అమ్ముకునే వారని కానీ కే.సి.ఆర్. ప్రభుత్వం లక్ష నూట పదహారు కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఆదుకుంటున్నారన్నరు. చెంచులకు, గిరిజనులకు ఆరోగ్యం కొరకు పల్లె దవాఖనాలు, 132 రకాల వైద్య నిర్ధారణ పరీక్ష కేంద్రం, విద్య కొరకు గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయి అన్నారు. రాష్ట్రంలో 25 నియోజక వర్గాల్లో ఒక్కో నియజకవర్గంలో 2 కోట్ల వ్యయంతో సేవాలాల్ గిరిజన భవనాలు నిర్మించేందుకు మంజూరు చేయడం జరిగిందన్నారు.  1976 నుండి 2023 వరకు గిరిజన రిజర్వేషన్ పై సమీక్ష నిర్వహించలేదని, తెలంగాణ ప్రభుత్వం గిరిజన  రిజర్వేషన్ ను 6 నుండి 10 శాతానికి పెంచిందని తెలిపారు.  గురుకుల పాఠశాల లకు 240 కోట్లు, ప్రతి యునివర్సిటీ లో హాస్టల్ వసతులకు 140 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. 

స్థానిక శాసన సభ్యుల అభ్యర్థన మేరకు అచ్చంపేట సేవాలల్ భవనానికి అదనంగా మరో కోటి రూపాయలు, మద్దిమాడుగు ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర భక్తుల సత్రం కొరకు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.  ఈ రోజు చేసిన  శంఖుస్థాపన పనులను ఎన్నికల లోపు ప్రారంభోత్సవం చేసుకునే విధంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రభుత్వ విప్ అచ్చంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ ఈ రోజు శంఖుస్థపన చేసిన పనుల్లో నాణ్యత లోపం లేకుండా దగ్గరుండి పూర్తి చేపిస్తా అన్నారు.  వచ్చే నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి అచ్చంపేట నియోజకవర్గానికి వస్తారని, ఉమా మహేశ్వరం రిజర్వాయర్, నిరంజన్ శావలి రిజర్వాయర్ ప్రాజెక్టులు మంజూరు చేయించి శంఖుస్థాపన లు చేయించడం జరుగుతుందన్నారు.  1600 కోట్లతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కు స్టేజ్ 1, స్టేజ్ 2 గా విభజించుకొని పూర్తి చేసుకోవడం జరుగుతుందన్నారు.  డిండి రిజర్వాయర్, రాయల్ గండి రిజర్వాయర్ ద్వారా అప్పర్ ప్లాట్ కు సాగు నీరు తీసుకువస్తామని తెలియజేశారు. ఇప్పటికే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడం జరుగుతుందని తెలిపారు. సెవాలాల్ భవనానికి మరో కోటి రూపాయలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. 

ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ శాంతకుమారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక వర్గానికి సంబంధించిన అవసరాలు, వారి ఆర్థిక సాధికారత కొరకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు.  అచ్చంపేట శాసన సభ్యులు తన నియోజక అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. అదనపు కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో 14500 మంది చెంచుల నివసిస్తున్నారు అన్నారు.  వారి ఆరోగ్య, విద్య, ఆర్థిక అభివృద్ధికి అన్ని రకాలైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలియజేశారు.  చెంచులకు 102 పక్క ఇళ్లు, ఆరోగ్య కేంద్రాలు, సోలార్ లైట్లు, తాగు నీరు, స్వయం ఉపాధికి ఆర్థిక సహకారం, గర్భిణీ, పిల్లలకు ప్రత్యేక మైన పౌష్ఠికాహారం అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో గిరిజన శాఖ సంయుక్త కార్యదర్శి సర్వేశ్వర రెడ్డి, సి. ఈ. జ్యోతి, మున్సిపల్ చైర్మన్ నర్సింహ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, మార్కెటింగ్ చైర్మన్  బి. అరుణ,  పదర జడ్పీటిసి రాంబాబు, అచ్చంపేట జడ్పీటిసి మంత్రియ  నాయక్, ఎంపిపి శాంత బాయి, భా.రా.స నాయకులు గోపాల్, తులసిరాం, అధికారులు, ప్రజా ప్రతినిదులు, ప్రజలు పాల్గొన్నారు.