ఆస్తిపన్ను వడ్డీపై 90 శాతం రాయితీ

ఆస్తిపన్ను వడ్డీపై 90 శాతం రాయితీ
  • బకాయిదారులకు భలే మంచి అవకాశం

ముద్ర ప్రతినిధి, బోడుప్పల్: మీరు నాలుగైదేళ్లుగా ఇంటిపన్ను బకాయి చెల్లించాల్సివుందా? వడ్డీతో కలిపి వేలాది రూపాయలు కార్పొరేషన్ కు చెల్లించాల్సివుందా? అయితే, మీకు రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్తరమైన అవకాశం కల్పిస్తోంది. మీరు చెల్లించాల్సిన ఇంటిపన్ను బకాయి మొత్తంపై వడ్డీలో కేవలం పది శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. తొంభైశాతం వడ్డీ రాయితీని కల్పిస్తూ, వన్ టైమ్ సెటిల్ మెంట్ కు మున్సిపల్ పరిపాలనా శాఖ అవకాశం కల్పిస్తోంది. బోడుప్పల్  మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.రామలింగం ముద్ర ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బోడుప్పల్ కార్పొరేషన్ లో మొత్తం 40 వేల మంది పన్ను చెల్లింపుదారులు వున్నారని, వారిలో ఇప్పటికే 40 శాతం మంది బకాయి చెల్లించేశారని, మిగిలిన  పన్ను మొత్తం వసూలుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మార్చి నెలాఖరుకల్లా 100 శాతం పన్ను బకాయిల వసూలుకు తమ సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తున్నారని తెలిపారు. రెవిన్యూ సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్లి ఆస్తిపన్ను డిమాండ్ తెలియజెప్పడంతో పాటు, అక్కడికక్కడే ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు జరిపించుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వం కల్పించిన పన్ను రాయితీ, దీర్ఘకాలికంగా పన్ను చెల్లించకుండా తాత్సారం చేసిన వారికి ఒక మంచి అవకాశమని, అంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

వచ్చే నెల నుంచి పన్ను రివిజన్

రానున్న ఏప్రిల్ నుంచి ఆస్తిపన్ను రివిజన్ జరుగుతుందని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.రామలింగం తెలిపారు, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్తగా గుర్తించిన ఆస్తులపై మదింపు చేసే  పన్నులు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఆస్తుల విలువ భారీగా పెరిగినందున, కొత్త అసెస్ మెంట్లపై ఇప్పుడున్న దానికంటే కొంత శాతం పెరిగే అవకాశం లేకపోలేదని అన్నారు. అయితే, పన్ను మొత్తం ఎంత మేరకు పెరుగుతుందన్న దానిపై ఇంకా పూర్తిస్థాయిలో స్పష్టత లేదని అన్నారు. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని అపార్ట్ మెంట్లలో ఒకే విస్తీర్ణంలో పైన, కింద వున్న ఇళ్లకు పన్ను డిమాండ్ వేర్వేరుగా ఉందన్న ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని తొందరలో పరిష్కరిస్తామని తెలిపారు. 

కార్పొరేషన్ కు సిబ్బంది చాలడంలేదట!

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కు సిబ్బంది చాలడం లేదట... కార్పొరేషన్ మేనేజర్ నాగేంద్రబాబే స్వయంగా ఈ విషయం సెలవిచ్చారు. సంస్థ మేనేజరుగా మీకు ఎంతమంది సిబ్బంది అవసరమో... మీ కమిషనరు ద్వారా పురపాలనశాఖ ఉన్నతాధికారులకు ఏమైనా నివేదించారా అంటే... ఇదేమైనా ప్రైవేటు కార్యాలయమనుకున్నారా, ఇష్టం వచ్చినంత మంది సిబ్బందిని ఇవ్వడానికి కంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అపార్ట్ మెంట్ లో ఒకే విస్తీర్ణంలో పైన, కింద వున్న ఫ్లాట్లకు పన్ను డిమాండ్ లో తేడా విషయమై ప్రస్తావించినపుడు, ఎంత డిమాండ్ వుంటే, అంత మొత్తం కట్టాల్సిందేనని, తగ్గే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కొత్తగా పన్ను మదింపు మళ్లీ జరుగుతుందని, అప్పుడు అందరికీ పన్ను పెరుగుతుందని జవాబిచ్చారు. పన్ను చెల్లింపుదారుల సందేహాలను నివృత్తి చేయాల్సిన మేనేజరే, ఒక్కొక్కరికి ఒక్కో పదేసి నిముషాలు మాట్లాడేందుకే కేటాయిస్తే, మా పనులు ఇంకేమీ చేసుకోవద్దా అంటూ రుసరుసలాడారు.