మోరంచపల్లెకు అండగా ఉంటున్నాం..

మోరంచపల్లెకు అండగా ఉంటున్నాం..
  • ప్రభుత్వ నుండి పరిహారం అందేలా చూస్తాం..
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..
  • బాధితులకు చెక్కులు పంపిణీ..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: మోరంచపల్లెకు అన్నివిధాలా అండగా ఉంటున్నామని, ప్రభుత్వ నుండి పరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లిలో బుధవారం 320 కుటుంబాలకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ల చేతులమీదుగా రూ.32 లక్షల విలువగల చెక్కులను ప్రతి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకి, రైతులకి అకాల భారీ వర్షాలతో జరిగిన పంట నష్టాలకు, ఆస్తి నష్టాలకు ప్రభుత్వపరమైన అన్ని సహాయ సహకారాలు అందేలా చూస్తామని అన్నారు. ప్రకృతి వైపరీత్యంతో జరిగిన ఈ నష్టాన్ని ఎవరు కూడా ఊహించలేదని, జరిగిన నష్టంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి సహాయక చర్యలు తీసుకుంటుందని, వరదలు రావడం చాలా బాధాకరమని అన్నారు. వరదలపై రాజకీయం చేసే పలువురు పరిస్థితి చూస్తే సిగ్గేస్తుందని, రాజకీయాలు కేవలం ఎన్నికల వరకేనని, మాపై నమ్మకంతో ఓటు వేసిన ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో, ఉంటూ వారి కష్టసుఖాల్లో మా వంతు సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, ప్రతి కోణాన్ని రాజకీయంగా చూసే అలవాటు తనకు లేదని చెప్పారు.

మోరంచపల్లి గ్రామం వర్షాలతో నీట మునిగిన విషయం తెలియగానే జిల్లా కలెక్టర్ తో కలిసి, మొదటి రోజు నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, సహాయక చర్యలు తీసుకున్నామని, నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ తో, మంత్రి కేటీఆర్ తో ఫోన్లలో ప్రతిక్షణం అందుబాటులో ఉంటూ వరదల్లో చిక్కుకున్న బాధితులను కాపాడడానికి బోటు సహాయాలు, ఎన్ డి ఆర్ ఎఫ్ సహాయాలు తీసుకొని వరదల్లో మునిగిన బాధితులను కాపాడడం జరిగిందని గుర్తు చేశారు. వరద ఉధృతికి సర్వం కోల్పోయిన వారికి మా గండ్ర మోహన్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కూడా ప్రతి ఇంటికి రూ. 4 వేల చొప్పున మొత్తం గ్రామంలో 11 లక్షల 60 వేల రూపాయల నగదును మా వంతు సహాయంగా అందించడం జరిగిందని, మాతో పాటు మా కుటుంబ సభ్యులైన గండ్ర భూపాల్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రెడ్డి, మా మిత్రులు ప్రీతి గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం స్థానికంగా ఉన్న గ్రామ ప్రజలకు తమ వంతు సహకారాలు అందించడం జరిగిందని గుర్తు చేశారు. వర్షాలతో జరిగిన వరద బీభత్సానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. రేపు అసెంబ్లీలో భూపాలపల్లి జిల్లాలో జరిగిన నష్టంపై చర్చిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు.