ఓటుకు నోట్లు ఇవ్వలేదని.... వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఓటుకు నోట్లు ఇవ్వలేదని.... వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి :ఓటుకు నోట్లు ఇస్తున్నారని తెలుసుకున్న ఓ వ్యక్తి తన ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయని, ఓటుకు వెయ్యి చొప్పున రూ.4000 ఇవ్వాలని కోరగా ఓ ప్రధాన పార్టీకి చెందినవారు 2000 రూపాయలు ఇచ్చారు. తన ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే 2000 ఇవ్వడంతో మనస్థాపం చెందిన ఒకరు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తోకల నారాయణ అనే వ్యక్తి ఇంట్లో నాలుగు ఓట్లు ఉండగా ఓ పార్టీకి చెందినవారు 2000 రూపాయలు ఇవ్వగా తనకు 4000 ఇవ్వాల్సి ఉండగా 2000 ఇవ్వడంతో తాను ఓటు వేయనని సాయంత్రం వరకు వేచి చూశాడు. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ ఓటు వేయకపోగా తన భార్యను కూడా ఓటు వేయనివ్వలేదు. గురువారం సాయంత్రం పోలింగ్ సమయం ముగిసిన తర్వాత గ్రామస్తులతో వాగ్వాదానికి దిగిన నారాయణ  ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చేతులకు స్వల్ప గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే బాధితుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఓటుకు నోటు ఇవ్వకుంటే ఆత్మహత్యకు పాల్పడతారా అంటూ పలువురు నారాయణను మందలించారు. అంతేకాకుండా ఓటు హక్కును కూడా వినియోగించు కోకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు.