ఎన్నికల రూట్ మొబైల్ సెక్టార్ అధికారి విధులను అడ్డగించి, తప్పుడు సమాచారం ప్రచారం చేసిన వారిపై 2 కేసులు నమోదు, నిందితుల అరెస్ట్

ఎన్నికల రూట్ మొబైల్ సెక్టార్ అధికారి విధులను అడ్డగించి, తప్పుడు సమాచారం ప్రచారం చేసిన వారిపై 2 కేసులు నమోదు, నిందితుల అరెస్ట్
  • నాగారం, తుంగతుర్తి PS లలో కేసులు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-పోలింగ్ బూత్ లలో ఎక్కడైనా ఈవీఎం లలో సాంకేతిక సమస్యలు వస్తే అక్కడికి ఈవీఎం లను సమకూర్చడానికి ఆ ఎన్నికల రూట్ లలో విధులు నిర్వర్తిస్తున్న సెక్టార్ అధికారి అదనపు ఈవీఎం లను కలిగి ఉంటారు. వీటిని ప్రవేట్ ఈవీఎం లు అని అడ్డుకోవడం, విధులకు ఆటంకం కలిగించడం నేరం.

తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గo రూట్ మొబైల్ నెంబర్ 29 లో  విధులు నిర్వర్తిస్తున్న రూట్ సెక్టార్ అధికారి తన వద్ద కలిగిన అదనపు ఈవీఎం బాక్స్ లతో తన విధులు నిర్వర్తిస్తున్న కారులో తుంగతుర్తి లో గల ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రానికి (ఈ డి సి) కి తిరిగి వెళుతుండగా నాగారం మండలం పేరబోయినగూడెం వద్ద కొంత మంది వ్యక్తులు సెక్టార్ అధికారి వాహనాన్ని అడ్డుకుని దౌర్జన్యం చేసినారు. గోడౌన్ లో పెట్టటానికి ప్రవేట్ ఈవీఎం లను కారులో తరలిస్తున్నారు అని వీడియో తీసి తప్పుడు సమాచారంను ప్రచారం చేసి విధులకు ఆటంకం కలిగించారు. దీనిపై సెక్టార్ అధికారి, నాగారం మoడల వ్యవసాయ అధికారి గణేష్  పిర్యాదు చేయగా నిందితులపై నాగారం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది.నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్డుకోవడమే కాకుండా సెక్టార్ అధికారి వాహనాన్ని వెంబడించి  తుంగతుర్తి మండల కేంద్రంలో మరోసారి అడ్డుకుని విధులకు ఆటంకం కలిగించారు. దీనిపై కూడా తుంగతుర్తి పోలీస్ స్టేషన్ నందు సెక్టార్ అధికారి పిర్యాదు చేయగా నిందితులపై కేసు నమోదు చేయడం జరిగింది.ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిని అడ్డగించి విధులకు ఆటంకం కలిగించినందుకు నిందితులపై ఎన్నికల  నిబంధన ఉల్లంఘన క్రింద 2 కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.