గంగుల ప్రధాన అనుచరుడి పై రౌడీషీట్

గంగుల ప్రధాన అనుచరుడి పై రౌడీషీట్
  • జంగిలి సాగర్ పై ఇప్పటికే ఐదు క్రిమినల్ కేసులు
  • కరీంనగర్ లో వణికి పోతున్న భూకబ్జాదారులు
  • బిఆర్ఎస్ కార్పొరేటర్ల పై కొనసాగుతున్న విచారణ
  • భూమాఫియా గుండెల్లో నిద్రపోతున్న సింగం

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రధాన అనుచరుడు, సీతారాంపూర్ కార్పొరేటర్ జంగిలి సాగర్ పై కరీంనగర్ రూరల్ పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. దీంతో కరీంనగర్ లో ఇప్పటివరకు కార్పొరేటర్ స్థాయి నాయకుల పై రౌడీ షీట్ ఓపెన్ చేసిన దాఖలాలు లేవు. దీంతో ఒక్కసారిగా కరీంనగర్ ఉలిక్కిపడింది. ఇప్పటికే 5 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న సాగర్ పై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నట్టు కరీంనగర్ రూరల్ ఏసిపి కరుణాకర్ స్పష్టం చేశారు.

కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి భూమాఫియా పై ఉక్కు పాదం మోపడంతో ఇప్పటివరకు తమ భూములు కబ్జాకు గురై ఆందోళన చెందుతూ అచేతనంగా ఉన్న బాధితులు ఫిర్యాదులు చేయడానికి క్యూ కడుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా భూ కబ్జాలకు పాల్పడిన బిఆర్ఎస్ నేతలు ఇప్పుడు హడలిపోతున్నారు. దీంతో కరీంనగర్ లోని భూ కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు పోలీసులు ఇంటి తలుపు తట్టి అరెస్టు చేసి జైల్లోకి పంపుతారోనని ఆందోళనకు గురవుతున్నారు.

సీతారాంపూర్ పరిధిలోని మీ  భూమి సేఫ్ గా ఉండాలంటే 40 లక్షలు ఇవ్వాలని రిటైర్డ్ ఉపాధ్యాయుడిని డిమాండ్ చేశాడు జంగిల్ సాగర్. అధికార పార్టీ కార్పొరేటర్ కావడంతో గత్యంతరం లేక పది లక్షలు ముట్ట చెప్పాడు. దీంట్లో రెండు లక్షలు ఫోన్ పే చేయగా ఎనిమిది లక్షలు నేరుగా అందించినట్లు సీసీ ఫుటేజ్ లతోపాటు ఆధారాలను సీపీకి అందజేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టిన పోలీసులు జంగిల్ సాగర్ ను అరెస్టు చేసి కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఐదు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉండడంతో రౌడీ షీట్ ఓపెన్ చేసి భూ కబ్జాదారుల గుండెల్లో కరీంనగర్ సిపి సింహ స్వప్నంగా మారారు.

భూ కబ్జాలపై పోలీసులు చేపట్టిన ప్రత్యేక చర్యలను జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు. కరీంనగర్ లోని ప్రభుత్వ, ప్రైవేటు భూ కబ్జాలపై ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసిన పోలీస్ కమిషనర్ ను అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా మరో బిఆర్ఎస్ కార్పొరేటర్ తోట రాములు ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ తో పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. బెయిల్ పై జైలు నుండి బయటకు వచ్చిన విషయం విధితమే. మరో కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ ను సైతం పోలీసులు విచారిస్తున్నట్లు వెల్లడవుతుంది. రౌడీ షీట్, అరెస్టులు, విచారణలతో కరీంనగర్ బి ఆర్ ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది.