పాలన సౌధంలో గంగుల పూజలు

పాలన సౌధంలో గంగుల పూజలు

 స్వయం పాలనలో మహోజ్వల ఘట్టం

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : తెలంగాణ స్వయం పాలనలో మరో మహోజ్వల ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలతో, అత్యుత్తమ పాలనా సౌదం డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమై తెలంగాణ సమాజానికి అంకితం చేసిన సువర్ణ ఘట్టం.

సచివాలయం లోని నాలుగవ అంతస్తు డి వింగ్ లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సతీసమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ఈ మహత్తర ఘట్టంలో పాలుపంచుకొనే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

ఐసీడీఎస్ అంగన్వాడీలకు పోషకాల సన్నబియ్యం పంపిణీపై పౌరసరఫరాల శాఖలో గంగుల తొలిసంతకం చేశారు. అణగారిన వర్గాల జీవితాల్లో బాబాసాహెబ్ పెనుమార్పులు తెచ్చాడని ఆయన పేరుతో వెలిసిన పరిపాలనా సౌదం నుండి బీసీ మంత్రిత్వ శాఖ ద్వారా బీసీ కార్పోరేషన్, ఎంబీసీ కార్పోరేషన్ ఆక్షన్ ప్లాన్ పై రూపొందించిన ఫైలుపై సంతకం చేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జెడ్పి చైర్మన్ కనుమల్ల విజయ, సివిల్ సప్లై చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, మేయర్ వై సునీల్ రావు, గ్రంధాలయ కమిటీ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ తోపాటు కరీంనగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.