నిరుద్యోగుల ఉపాధికి మార్గం " పిఎంఈజిపి 50 లక్షల వరకు రుణాలు- బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర

నిరుద్యోగుల ఉపాధికి మార్గం " పిఎంఈజిపి 50 లక్షల వరకు రుణాలు- బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి భరోసాకల్పించాలనే ఉద్దేశంతో  మోడీ ప్రభుత్వం  ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్ మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ( పి ఎం ఈ జి పి) ప్రవేశపెట్టిందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర అన్నారు. స్వశక్తితో నిలబడాలనుకునే నిరుద్యోగులకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ఎంతగానో దోహదపడి , నిరుద్యోగుల ఉపాధికి మార్గంగా నిలుస్తుందని తెలిపారు. గురువారం  ఆయన మాట్లాడుతూ గతంలో ప్రధానమంత్రి రోజ్ గార్ యోజన, గ్రామీణ ఉపాధి కల్పనపథకం  అనే రెండు రకాల పథకాలను  కేంద్ర ప్రభుత్వం నిర్వహించేదని , అనంతరం మోడీ ప్రభుత్వం ఈ రెండు పథకాలను కలిపి   ప్రధానమంత్రి ఉపాధి పథకం (పి ఎం ఈ జి పి)  తీసుకువచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని సూక్ష్మ , చిన్న , మధ్యతరగతి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా ఇట్టి పథకం  అమలవుతుందన్నారు. జాతీయస్థాయిలో నోడల్ ఏజెన్సీ ద్వారా, రాష్ట్రాల పరిధిలో కె వి ఐ సి బోర్డులు , జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తుందని  తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణాల్లో ఉపాధి ఉద్యోగం లేక  చెల్లా చెదిరిపోయిన చేతివృత్తుల వారికి  , నిరుద్యోగ యువతను మళ్లీ సంఘటితం చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక స్వావలంబన చేకూర్చడం జరుగుతుందన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం , నివాస ప్రాంతాల్లోనే సుస్థిర ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించి ఇతర ప్రాంతాలకు వలసలను నిరోధించాలనే  లక్ష్యంతో  , పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే తపన ఉన్న ఔత్సాహికులను ప్రోత్సహించడానికి  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. 2026 వరకు ఇట్టి పథకాన్ని అమలు చేసి  విజయవంతంగా  కొనసాగించడానికి అందుకు తగిన నిధులను కేటాయిస్తూ కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. వ్యాపార సంస్థలు, సేవారంగంలో యూనిట్లు స్థాపించడానికి 18 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరూ అర్హులేనని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా పలు రకాల రంగాల్లో వ్యాపార , పరిశ్రమల యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.  358 రకాల వ్యాపారాలను  ఈ పథకం ద్వారా ప్రారంభించవచ్చన్నారు. ముఖ్యంగా ఈ పథకం ద్వారా పెట్టబోయే వ్యాపార యూనిట్ కు  లక్ష రూపాయల నుండి 50 లక్షల వరకు ,  సర్వీస్ యూనిట్ల అయితే 20 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తుందన్నారు . రెండవ విడతలో గరిష్టంగా కోటి రూపాయల వరకు కూడా రుణాలను మంజూరు చేస్తుందన్నారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వ్యాపార యూనిట్ కు  గరిష్టంగా 35 శాతం రాయితీ ఉంటుందని, పట్టణ ప్రాంతాల్లో వాటికి 25 శాతం రాయితీ ఉంటుందని , ఇట్టి రాయితీ ప్రత్యేక కేటగిరీకి చెందిన ఎస్సీ ,ఎస్టీ, ఓబీసీ, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, శారీరక వైకల్యం కలిగిన వారికి వర్తిస్తుందన్నారు. జనరల్ కేటగిరి అభ్యర్థులకు కూడా రుణంలో సబ్సిడీ సదుపాయం ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం సబ్సిడీ, పట్టణ ప్రాంతాల్లో 15 శాతం సబ్సిడీ  ఉంటుందన్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన లబ్ధిదారులు ఐదు శాతం సొంత వనరుగా పెట్టుబడి పెడితే  95 శాతం మొత్తాన్ని రుణంగా అందిస్తారని , అలాగేసాధారణ కేటగిరి లబ్ధిదారులకు ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం పెట్టుబడి పెడితే 90 శాతం మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణంగా అందజేస్తారన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకానికి నిరుద్యోగ  అభ్యర్థులు www.kvionline.gov.in  (Spansaring agency _ DIC ) వెబ్ సైట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం  ఉందన్నారు.  కుల దృవీకరణ పత్రము, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్ , సాంకేతిక విద్యార్హతలు ( ఏవైనా ఉంటే),  సర్టిఫికెట్,  ప్రత్యేక కేటగిరికి చెందిన వారైతే కుల ధ్రువీకరణ పత్రం, యూనిట్ స్థాపించే జనాభా సర్టిఫికెట్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ప్రాజెక్టు రిపోర్ట్ వివరాలు, లోను మంజూరు చేసే బ్యాంకు తదితర వివరాలతో సంబంధిత కెవిఐసి , జిల్లా పరిశ్రమల  కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.