దేశంలోనే తొలిసారిగా విద్యార్థులకు అందుబాటులో ఈ - సంజీవిని

దేశంలోనే తొలిసారిగా విద్యార్థులకు అందుబాటులో ఈ - సంజీవిని
  • బీబీనగర్ ఎయిమ్స్ ద్వారా ప్రారంభం
  • రెండు పాఠశాలల విద్యార్థులతో టెలి కాన్ఫరెన్స్

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: దేశంలోనే తొలిసారిగా బీబీనగర్ లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) పాఠశాల విద్యార్థులకు ఈ – సంజీవిని (టెలీ మెడిసిన్) ను ప్రారంభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ, బీబీనగర్ మండలంలోని అంకుషాపూర్ లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల విద్యార్థినులతో ఎయిమ్స్ వైద్యులు నేరుగా సంప్రదించారు. ఎయిమ్స్ కార్యనిర్వాహక సంచాలకుడు ప్రొఫెసర్ డాక్టర్ వికాస్ భాటియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యాసంస్థలలోని విద్యార్థుల ఆరోగ్య అవసరాలను ఈ కార్యక్రమం పరిష్కరించడానికి వీలు కల్పిస్తుంది. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణలో ఎయిమ్స్ చొరవ తీసుకుని, మొహాలికి చెందిన సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ (సి-డాక్) సహకారం తీసుకుంది. టెలిమెడిసిన్ విభాగంలో సి-డాక్ అనేక సొల్యూషన్లను ఆవిష్కరించింది. ఇది రోగులు రిమోట్‌గా వైద్యులను సంప్రదించడానికి, వైద్య రికార్డులను పంచుకోవడానికి అనుమతిస్తుంది. మొహాలికి చెందిన సి-డాక్ నిపుణుడు రాకేష్ కౌశిక్ ఆధ్వర్యంలో ఎయిమ్స్ ఈ-సంజీవినిని ప్రారంభించింది.

ఈ సందర్భంగా ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ, ఈ-సంజీవిని ద్వారా విద్యార్థుల ఆరోగ్య సమస్యలను నేరుగా తెలుసుకుని, వారికి సక్రమమైన వైద్య చికిత్సను అందించడానికి వీలువుతుందని తెలిపారు. ఈ విధానం ద్వారా విద్యార్థులకు నిపుణులైన వైద్యుల ద్వారా సరైన వైద్యసేవలు, సలహాలు లభిస్తాయని అన్నారు. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడంతో పాటు వారి వైద్య అవసరాలను సమర్థంగా తీర్చడంలో ఈ – సంజీవిని కీలకపాత్ర పోషిస్తుందని, తద్వారా విద్యార్థులకు వారి విద్యాపరమైన విషయాలలో మద్దతునిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ డీన్ ఆఫ్ అకడమిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ నారంగ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అభిషేక్ అరోరా, మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్యామలా అయ్యర్, డాక్టర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆయా పాఠశాలల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంలో విద్యాసంస్థలతో ఎయిమ్స్ చొరవను అంతా ప్రశంసిస్తున్నారు. కోవిడ్ సందర్భంగా ఎయిమ్స్ బీబీనగర్ లో ఇప్పటికే 2020 సెప్టెంబర్ 1 నుంచి టెలిమెడిసిన్  ప్లాట్ ఫారమ్ అయిన ఈ –సంజీవిని పనిచేస్తోంది. రోగుల ఆరోగ్య సంరక్షణకు వీలుగా నిపుణులను సంప్రదించేలా చేయడంతో పాటు, సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్సను ఇది సులభతరం చేస్తుంది. తాజాగా పాఠశాల విద్యార్థులకు దేశంలోనే తొలిసారిగా ఈ సేవలను విస్తరించిన సంస్థగా ఎయిమ్స్ గుర్తింపును పొందింది.