అందరి సహకారంతో జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు : జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ

అందరి సహకారంతో జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు : జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ

 ముద్ర ప్రతినిధి భువనగిరి : అందరి సహకారంతో జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ అన్నారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ బుధవారం నాటికి జిల్లాలో రెండు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసినందున జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, కలెక్టరేటు సిబ్బంది ఆయనను కలెక్టరేటు కాన్ఫరెన్స్ హాలులో సన్మానించి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన అందరిని ఉద్దేశించి మాట్లాడుతూ, జిల్లా కలెక్టరు నేతృత్వంలో ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో క్షేత్ర స్థాయి నుండి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతున్నాయని అన్నారు.

మండల స్థాయి అధికారులతో పాటు మండల స్పెషల్ ఆఫీసర్లను భాగస్వామ్యం చేయడంతో జిల్లాలోని 421 గ్రామ పంచాయితీలు, 17 మండలాలు, 6 మున్సిపాలిటీలలో క్షేత్రస్థాయి నుండి సంక్షేమ కార్యక్రమాలు ప్రణాళికాబద్దంగా నిర్వహించబడుతున్నాయని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామసీమలలో, మున్సిపాలిటీలలో మౌళిక సదుపాయాలు పెరిగాయని, స్వచ్చ సర్వేక్షణ్ పనులు చురుకుగా సాగుతున్నాయని అన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా పచ్చదనం పెరిగిందని, ట్రాక్టర్స్ ట్రాలీల ఏర్పాటుతో పారిశుద్యం పనులు నిరాటంకంగా సాగుతున్నాయని అన్నారు. 

సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన (సాగి) క్రింద మౌళిక వసతులు, కనీస జీవన సదుపాయాల కల్పనలో దేశంలోనే వడపర్తి, కొలనుపాక గ్రామాలు మొదటిగా నిలిచాయని, అలాగే వడపర్తి గ్రామంలో వంద శాతం సురక్ష బీమా చేయించడం జరిగిందని, బయట రాష్ట్రాల సాగి నోడల్ ఆఫీసర్ బృందాలు ఈ గ్రామాలను సందర్శించి స్టడీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో అందరి సహకారం మరువలేనిదని అన్నారు. జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, అదనపు కలెక్టరు దీపక్ తివారీ జిల్లాలో విజయవంతంగా రెండు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసి మూడవ సంవత్సరం లోనికి అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ, దీపక్ తివారీ మృదు భాషి, మితభాషి అని, ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రిలో అభివృద్ధి కార్యక్రమాలను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారని అన్నారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల పనులలో భాగంగా స్థల సేకరణలు పూర్తి చేసి వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు సకాలంలో పూర్తి చేయడంలో, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రైతువేదికల నిర్మాణ పనులలో ముఖ్యపాత్ర వహించారని, అతి కొద్ది సమయంలో జిల్లా అన్ని రంగాలలో ముందుండేలా చేశారని అన్నారు.