త్యాగానికి ప్రతీక ఈద్ ఉల్ అజ్హా

త్యాగానికి ప్రతీక ఈద్ ఉల్ అజ్హా
  • నేడు బక్రీద్ వేడుకలు
  • ప్రత్యేక ప్రార్థనలకు ముస్తాబైన ఈద్గాలు

మెట్‌పల్లి ముద్ర: త్యాగానికి, దేవునిపై భక్తికి బక్రీద్ పండుగు తార్కాణంగా నిలుస్తోంది. అల్లాహ్ ఆదేసం ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ ను (ఖర్బాని) బలి ఇవ్వడానికి తీసుకెళ్లే సాంప్రదాయాన్ని స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు. ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‌ ‌తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ఈ నెల ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరుతారు. హజ్ యాత్రకొరకు సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి చేరుకుని మస్జిద్ ఉల్ హరామ్‌లో ఉన్న కాబా చుట్టూ ఏడు ప్రదక్షణలు చేసి మసీదులో ప్రార్థనలు చేస్తారు.  ప్రపంచంలోని ముస్లింలందురూ కాబా వైపు తిరిగి నమాజు చేస్తారు. దీనినే ఖిబ్లా అని కుడా అంటారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమౌతారు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. 


 
ముస్లిం సోదరుల సామూహిక ప్రార్థనలు...
రంజాన్‌లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా (ధార్మిక ప్రసంగం)తో ఈద్గా‌లో సామూహిక ప్రార్థనలు జరుపుతారు. ఆ తరువాత వారు నెమరు వేసే జంతువులను (ఒంటె, మేక, గొర్రె, ఎద్దు) మాత్రమే ఖుర్బానీ (బలి) ఇస్తారు. బలి ఇచ్చిన తరువాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. ముస్లింలు త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.

త్యాగానికి గుర్తుగా...
ముఫ్తి అబ్దుల్ మోయిజ్ శాంజి, మత గురువు, మెట్ పల్లి.
ఇస్లాం క్యాలెండర్‌లో జిల్‌ హిజ్జా మాసం పదో రోజున ‘ఈదుల్‌-ఉల్‌-జుహ’ (బక్రీద్‌)ను నిర్వహిస్తారని ముఫ్తి అబ్దుల్ మోయిజ్ షమీ ఇమామ్ తెలిపారు. ఒక మహోన్నత త్యాగానికి గుర్తుగా ఈ పండుగను ముస్లింలు జరుపుకొంటారని, అదే ఇబ్రహీమ్‌, ఇస్మాయీల్‌ల త్యాగమని, దైవాజ్ఞను పొందిన ఇబ్రహీమ్‌ తన ఏకైక సంతానమైన ఇస్మాయీల్‌ను దైవ ప్రసన్నత కోసం బలి ఇవ్వడానికి సిద్ధపడతాడని తెలిపారు. అది ‘దైవాజ్ఞ’ అని తెలుసుకున్న ఇస్మాయీల్‌ కత్తి కింద తన శిరస్సును సంతోషంగా పెడతాడని, ఈ అనుపమానమైన, అమూల్యమైన త్యాగానికి గుర్తుగా తమ ప్రాణాలను అల్లాహ్‌ మార్గంలో త్యాగం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని ఖుర్బానీ ద్వారా ముస్లింలు చాటుతారని తెలిపారు. ఒకసారి ఇబ్రహీమ్‌ తన ప్రియమైన కుమారుణ్ణి జిబహ్‌ (బలి) చేస్తున్నట్టు కలలో చూశారని, వెంటనే దాన్ని దైవాజ్ఞగా తలచి, తన ముద్దుల కుమారుణ్ణి జిబహ్‌ చేయడానికి తీసుకువెళ్ళారని, నిర్ణీత ప్రదేశంలో, కళ్ళకు వస్త్రం కట్టుకొని జిబహ్‌ చేయడం ప్రారంభించారని తెలిపారు.

అల్లాహ్‌ ప్రసన్నుడై ఒక గొర్రె పోతును పంపించారని, ఇస్మాయిల్‌ను ఆ గొర్రెపోతు పక్కకు జరిపి ఆయన స్థానంలో జిబహ్‌ అయిందన్నారు. అల్లాహ్‌ దైవదూతలందరినీ హాజరుపరిచి, ‘‘నా ఆజ్ఞను అందుకున్న ఇబ్రహీమ్‌ తన కుమారుణ్ణి జిబహ్‌ చేయడానికి వెనుతియ్యలేదని చెప్పాడని, ఆ రోజు నుంచి ప్రళయదినం వరకూ ఖుర్బానీని ఇస్లాంలో భాగం చేశాడని, తరువాత, ఇబ్రహీమ్‌ చేతుల మీదుగా తన గృహాన్ని (కాబాను) అల్లాబ్‌ ఈ భూమిపై నిర్మింపజేశాడని తెలిపారు. ఆ రోజు నుంచి హజ్‌ యాత్రను విధిగా చేయడం జరిగిందని, ఇబ్రహీమ్‌, ఇస్మాయీల్‌ ఇటుకలపై ఇటుకలు పేరుస్తూ కాబా గృహాన్ని నిర్మించారని, సత్యంపై నిలబడడం, దానికోసం ప్రాణాలను అర్పించడానికైనా వెనుకాడకపోవడం, దైవాజ్ఞ కోసం కుమారుణ్ణి సైతం త్యాగం చెయ్యడానికి సిద్ధపడడం, సత్యం కోసం స్థిరంగా నిలబడమే పండుగ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు  కాగా బక్రీద్ పండుగ సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి మెట్ పల్లిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.