ప్రశాంత ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీలు సహకరించాలి: కలెక్టర్ రాజర్షి షా

ప్రశాంత ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీలు సహకరించాలి: కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాజర్షి షా కోరారు.  మంగళవారం సాయంత్రం, కలెక్టరేట్ లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో  సమావేశం  నిర్వహించారు.  జిల్లా ఎస్పి రోహిణి  ప్రియదర్శని, అదనపు కలెక్టర్  లు రమేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.  ప్రశాంత వాతావరణంలో జరగాలని,  ప్రతి అంశం  ఎన్నికల నిబంధనలకు లోబడి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల ఫిర్యాదులు, అనుమతులు, నామినేషన్ ప్రక్రియలను సులభతరం చేసేలా సీ-విజిల్, ఈ-సువిధ యాప్ లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.  ఈ- సువిద యాప్ ద్వారా పార్టీ సమావేశాలకు సంబంధించి ముందస్తు అనుమతులను పొందవచ్చని, అదే విధంగా నామినేషన్ కూడా ఈ-సువిద యాప్ ద్వారా వేసే అవకాశాన్ని ఎన్నికల కమీషన్ కల్పించదన్నారు. పొలిటికల్ పార్టీలకు చెందిన వారు వారి  బూత్ స్థాయి ఎజెంట్ల వివరాలను సమర్పించాలని కోరారు. 

 ప్రచారాలను ఎప్పటికప్పుడు కమిటిల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.  జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యాలు వారిద్వారా పోలిటికల్ పార్టీలకు సంబంధించిన పోస్టర్ నుండి పాంప్లెట్ వరకు ప్రింటింగ్ చేసే ప్రతిదానిపై ప్రెస్ పేరు, సెల్ ఫోన్ వివరాలను తప్పక అచ్చువేయాలని, ఆ దిశగా స్పష్టమైన ఆదేశాలను ప్రింటింగ్ ప్రెస్ లకు అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో విద్యుత్, మంచినీరు, టాయిలెట్, షామియాన, వికలాంగుల కోసం ర్యాంపులు, వీల్ చైర్ మొదలగు మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులపై వాల్ రైటింగ్, పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్లు తదితరాలన్ని 24 గంటలలోపు, అన్ని పబ్లిక్ స్థలాల్లో ఉన్న వాటిని 48 గంటల్లో, ప్రయివేటులో ఉన్న వాటిని 72 గంటలలోపు తొలగించాలని ఆయన ఆదేశించారు.  వెబ్సైట్ లో రాజకీయ నాయకుల ఫోటోలు తొలగించాలన్నారు. ప్రభుత్వ వాహనాలు రాజకీయ అవసరాలకు వాడరాదన్నారు. 

మీడియా సెంటర్ ప్రారంభం
సాదారణ ఎన్నికలు-2023 సందర్బంగా  మీడియా సెంటర్ ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. అదనపు కలెక్టర్ లు రమేష్, వెంకటేశ్వర్లు ఉన్నారు.