అంగన్ వాడీ కేంద్రాలు చిత్తశుద్ధితో పనిచేయాలి: కలెక్టర్ భవేష్ మిశ్రా

అంగన్ వాడీ కేంద్రాలు చిత్తశుద్ధితో పనిచేయాలి: కలెక్టర్ భవేష్ మిశ్రా
Angan wadi centers should work with sincerity Collector Bhavesh Mishra

అంగన్ వాడీ కేంద్రాలు చిత్తశుద్ధితో పనిచేయాలి..
- విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:  జిల్లాలో ఉన్న అంగన్ వాడీ కేంద్రాలు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణ, పిల్లల ఆరోగ్యం, సామ్,  మ్యాం, పోషణ వివరాలు, భోజనం, విద్యా బోధనలు వంటి పలు అంశాలపై, డిడబ్ల్యూఓ శామ్యూల్, సిడిపిఓలు, సూపర్ వైజర్లతో శుక్రవారం స్థానిక ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కలెక్టర్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 644 అంగన్ వాడి కేంద్రాలను ప్రతి నెల తనిఖీ చేసి అక్కడ పనితీరు వివరాలను నిర్దేశించిన నమూనాలో పకడ్బందీగా నమోదు చేయాలని అధికారులకు చెప్పారు.  అంగన్ వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లల ఆరోగ్య పరిస్థితి, వారి ఎదుగుదల, వారికి అందిస్తున్న ఆహారం, నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రత తదితర విషయాలపై తనిఖీలు నిర్వహించాలని  ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.

జిల్లాలోని అంగన్ వాడీ కేంద్రాలను తనిఖీ చేయుటకు మండల, జిల్లా స్థాయి అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. గతంలో తాను ఆకస్మిక తనిఖీ చేసిన అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు సరిగా లేరని, రిజిస్టర్ల నిర్వహణ సరిగ్గా లేదని చెప్పారు. జిల్లాలో ఉన్న అంగన్ వాడీ  కేంద్రాల్లో  ప్రతి ఒక్క పిల్లవాడి సంపూర్ణ వివరాలు నోట్ చేయాలని, వారి ఎత్తు, బరువు, పోషక లోపం  తదితర వివరాలు నమోదు చేయాలని తెలిపారు. జిల్లాలో ఉన్న సామ్ పిల్లలు, మ్యాం పిల్లలు కలిపి సుమారు 400 మంది ఉన్నారని, సామ్ పిల్లల ఫోటో ప్రతి వారం, మ్యాం పిల్లల ఫోటో 15 రోజులకు ఒకసారి అందించాలని సూచించారు. అంగన్ వాడీ కేంద్రాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.


జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసిందని, అవసరమైన మేర అదనపు నిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, వీటిని వందశాతం సద్వినియోగం చేసుకుని మెరుగైన సేవలు అందించాలని, పిల్లల పోషణ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లాలో గతంలో ఖాళీగా ఉన్న 145 అంగన్ వాడి టీచర్ల పోస్టులను పారదర్శకంగా, నిబంధనలు అనుసరిస్తూ నియామకం చేసామని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలను సైతం పారదర్శకంగా ఎంపిక చేయాలని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన చిన్న పోరపాటు కారణంగా 2 సంవత్సరాల పాటు నియామక ప్రక్రియ ఆటంకం కలిగిందని, మన జిల్లాలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి అవకాశం ఉండొద్దని కలెక్టర్ తెలిపారు.