శ్రీస్వామి వారి సన్నిధిలో అష్టోత్తర శతఘటాభిషేక మహోత్సవం

శ్రీస్వామి వారి సన్నిధిలో అష్టోత్తర శతఘటాభిషేక మహోత్సవం
  • సాయంత్రం శృంగార డోలోత్సవం
    ముద్ర ప్రతినిధి భువనగిరి : యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో గురువారం ఉదయం శ్రీ స్వామి వారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం కార్యక్రమంను ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, వేదపండితులు, పారాయణీకులు అత్యంత వైభవముగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కర్ రావు, ఉప కార్యనిర్వహణాధికారి, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు.

  • అష్టోత్తర శతఘటాభిషేకము ప్రత్యేకత
    బ్రహ్మోత్సవవాలలో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో అష్టోత్తర శతఘటాభిషేక మహోత్సవం ఆగమశాస్త్రానుసారంగా వేదమంత్ర ఉచ్ఛారణలతో వైభవంగా నిర్వహించారు. 108 కలశములలోనికి ఆవాహన చేయబడిన సమస్త తీర్ధ రాజముల నదీనదముల మధురఫలరస పంచామృతములతో శ్రీ స్వామి వారి అమ్మవారి ఉత్సవమూర్తుల, మూలవరుల స్నపనతిరుమంజన వేడుక ఎంతో వైభవముగా నిర్వహించారు. 108 కలశములు భగవంతుని అష్టోత్తర శతనామముల సంకేతాలు అనంత నామధేయుడైన భగవానుడు సులభముగా భక్తులకు తన అనుగ్రహాన్ని సంపూర్ణంగా అందించడానికి ఈ 108 నామములను సంకేతముగా ఏర్పరచుకొనెను, శరీరంలోని నూటఒక్కనాడి మండలములు, సప్తధాతువులు కలిపి 108గా ఒక ప్రసిద్ధి కలదు. ఇతరములైన ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకొనిన ఈ వేడుక దర్శించినంత మాత్రముననే భగవంతుని సంపూర్ణ అనుగ్రహం కలుగుట పురాణ ప్రసిద్ధమై ఉన్నది. సంఖ్యాశాస్త్రపరంగా 108ని ఏకత్రితము చేయగా తొమ్మిది సంఖ్య ఏర్పడును. తొమ్మిదవ సంఖ్య నవవిధ భక్తులకు సూచకము. తొమ్మిది కలశములలో జలములు, మిగతా కలిశములలో పాలు పెరుగు పంచామృతం, పండ్ల రసములు, సుగంధపరిమళ ద్రవ్యములు మరెన్నో విశేషములు గల వస్తు జాలమును నిలిపి వేదమంత్రముల మధ్య అభి షేకించుట విశేషమైయున్నది.

  • సాయంకాల కార్యక్రమములు
    గురువారం సాయంకాలం శ్రీ స్వామి వారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ స్వామి వారి శృంగార డోలోత్సవమును ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, ఆర్చకబృందం, వేదపండితులు, పారాయణీకులు అత్యంత వైభవముగా విర్వహించారు. అనంతరం ఉత్సవపరిసమాప్తి గావించారు. ఈ వేడుకలలో ఆలయ అధికారులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. రాత్రి  డి. లక్షణాదేవి బృందం వారిచే శృంగార డోలోత్సవం కార్యక్రమం నిర్వహించారు.
    శృంగార డోలోత్సవము 
    డోలము అనగా ఊయల అని అర్ధం. సర్వాభరణభూషితులైన శ్రీ స్వామి వారిని, అమ్మవార్లను బంగారు నవరత్నఖచిత ఊయలలో వేంచేపు చేసి వేదమంత్ర పఠనములతో నయనానందకరముగా అత్యంత వైభవముగా ఈ వేడుక నిర్వహిస్తారు. శృంగార సుందర కిరీటలసద్వరాంగ అని శంకరాచార్యులు శ్రీ స్వామి వారిని కీర్తించుట ఎంతో విశేషమైయున్నది. ఈ డోలారోహణ మహోత్సవమును నిర్వహించుట వలన రాజా, రాష్ట్ర అభివృద్ధితో పాటుగా, భక్తుల అభీష్టములు నెరవేరునని పెక్కు పురాణములు పేర్కొనుచున్నవి.