ప్రచారంలో యువతికి ముద్దు పెట్టిన బీజేపీ ఎంపీ...

ప్రచారంలో యువతికి ముద్దు పెట్టిన బీజేపీ ఎంపీ...

ముద్ర,సెంట్రల్ డెస్క్:- ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ యువతికి ముద్దు పెటిన బీజేపీ నేతకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై అనేకమంది నేతలు విమర్శలు గుప్పిస్తుంటే సదరు నేత మాత్రం తన చర్యను సమర్థించుకుంటున్నారు. ఇక్కడ ఆ యువతి కూడా బీజేపీ నేత చర్యను సమర్థించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. బెంగాల్‌లోని ఉత్తర మాల్దా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ ఖగేన్‌ ముర్మూ పోటీ చేస్తున్నారు. ఆయన నియోజక పరిధిలోని శ్రిహిపుర్‌ గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సమయంలో అక్కడ ఓ యువతి చెంపపై ఆయన ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో పెద్ద రాజకీయ దుమారమే రేగింది.

ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ.. బీజేపీపై నిప్పులు చెరిగింది. ‘‘మీరు ఇప్పుడు చూస్తోంది నమ్మలేకపోతే.. దాని గురించి మేం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. బీజేపీ ఎంపీ, ఉత్తర మాల్దా అభ్యర్థి ఖగేన్‌ ముర్ము తన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ యువతికి ముద్దు పెట్టారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీలు.. బెంగాలీ మహిళలపై అసభ్యకర పాటలు రాసే నేతలు.. ఇలా బీజేపీ క్యాంప్‌లో మహిళా వ్యతిరేక నాయకులకు కొదవలేదు. నారీమణులకు ‘మోదీ పరివార్‌’ ఇస్తున్న గౌరవం ఇది. ఇలాంటి వాళ్లు అధికారంలోకి వస్తే ఇంకెన్ని చేస్తారో ఆలోచించండి..!’’ అంటూ రాసుకొచ్చింది.

కాగా.. ఈ వివాదంపై స్పందించిన ఖగేన్.. ఆమెను తన కుమార్తెలా భావించానని, పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటని విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. కుట్రపూరితంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారని, ఇలాంటి చిత్రాలను వక్రీకరిస్తూ వ్యక్తులు, పార్టీల పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే దీనిపై తప్పుడు రాతలు రాసిన వారిపై (టీఎంసీ) ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఆ యువతి కూడా ఎంపీకి మద్దతుగా మాట్లాడారు. ఆయన తనను కూతురిలా భావించి ముద్దు పెట్టుకున్నారని, అందులో తప్పేంటని ప్రశ్నించారు. ఆ ఫొటో తీసిన సమయంలో తన తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారని, ఇలాంటి ఘటనలను సోషల్ మీడియాలో వైరల్‌ చేసే వారిది చెత్త మనస్తత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు.