రైలు ప్రయాణాలు గాలిలో దీపాలా?

రైలు ప్రయాణాలు గాలిలో దీపాలా?
  • కవచ్​పై రైల్వేశాఖ, కేంద్ర ప్రభుత్వం గొప్పలు
  • అమలు తీరులో నిర్లక్ష్యం?!
  • రైలు ప్రమాదంలో 288 మంది మృతి..
  • 1175 మందికి గాయాలు.. 793మంది డిశ్చార్జ్​
  • 382 మందికి చికిత్స.. ఇద్దరి పరిస్థితి విషమం

ఒడిశా: ఒడిశా రైలు ప్రమాద నేపథ్యంలో మరోమారు భారతీయ రైల్వే ప్రయాణాలలో భద్రతపై పలు ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. రైల్వే ప్రయాణాలంటే గాలిలో దీపలా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.  ఓ వైపు గొప్పలు చెప్పుకుంటున్న రైల్వే సంస్థలు, కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ప్రమాదాలను అడ్డుకునే వ్యవస్థ ‘కవచ్​’ ఉంటే అమలు చేయడంలో జాప్యం వల్లే ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కవచ్​ వ్యవస్థ అమలు చేసి ఉంటే ఇంతమంది ప్రాణాలు దక్కేవని ఈ ఘటనపై రైల్వే సంస్థలు, కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఇప్పటికే ప్రతిపక్షాలతోపాటు పలువురు నిపుణులు, సామాన్య జనాలు కూడా డిమాండ్​ చేస్తున్నారు. ఏది ఏమైనా కేంద్ర బీజేపీ సర్కార్​పై ఈ ప్రమాదం తాలూకు నీడలు భవిష్యత్తులో కమ్ముకోనున్నాయనేది స్పష్టం.

కవచ్​ వ్యవస్థ ఏంటీ?

రైళ్ల ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ 2022 లో కవచ్ అనే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. కవచ్ అనేది ఒక ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థ. ఎదురుగా గానీ, వెనకవైపు నుండి గానీ ఒకే ట్రాక్​పై రెండురైళ్లు వేగంగా ప్రయాణిస్తున్నట్లయితే అవి ఢీకొనే ప్రమాదం ఉంటే కొన్ని కిలోమీటర్ల దూరం నుండే ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ వ్యవస్థతో రైళ్లకు ఆటోమేటిక్​గా బ్రేకులు పడతాయి. పట్టాలు బాగా లేనప్పుడు.. ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు.. ఎదురెదురుగా వచ్చినప్పుడు ఈ కవచ్ వ్యవస్థ గుర్తించి రైళ్లను ఆపుతుంది. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలు నడుపుతుంటే కవచ్‌లోని రక్షణ వ్యవస్థ హెచ్చరిస్తుంది.

ఎందుకు అమలు చేయలేదు?

కవచ్​ వ్యవస్థను కేంద్రం అమలు చేసి ఉంటే ఒడిశా ప్రమాదం చోటు చేసుకునేది కాదని పలువురు ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో కేంద్రం, రైల్వేశాఖలు దీనిపై వివరణనిచ్చాయి. ఈ వ్యవస్థను ఇప్పటికే దశలవారీగా ఆయా రూట్లలో అమలు చేస్తున్నామని, రూ. 400 కోట్లు ఖర్చుపెట్టి 1445 కిలోమీటర్ల మేర ప్రస్తుతం కవచ్​సిస్టమ్​ను దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.  బడ్జెట్​లో ప్రతీ యేటా ఈ వ్యవస్థ కోసం కేటాయింపులు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​ వెల్లడించారు. 2024లోపు రద్దీ మార్గాల్లో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.

వికారాబాద్​లో కవచ్​ పనితీరు పరీశీలన

2022 మార్చి 22 న కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ కవచ్ టెక్నాలజీని స్వయంగా వికారాబాద్​ జిల్లా నవాబ్​పేట్​ మండలం లింగంపల్లి- వికారాబాద్‌ సెక్షన్‌లోని గుల్లగూడ- చిటిగిడ్డ రైల్వే స్టేషన్ల మధ్య కవచ్‌ పనితీరును అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు.

మృతి, గాయాలు, చికిత్స పొందుతున్నవారి సంఖ్య

రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందారు. 1175 మందికి గాయాలు కాగా వారినందరిని ఒడిశాలోని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ఇందులో 793మందికి స్వల్ప గాయాలైన వారిని చికిత్సనందించి డిశ్చార్జీ చేశారు. 382 మందికి చికిత్స కొనసాగుతుండగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.