త్వరలో దేశంలో రైతుల తుఫాన్​

త్వరలో దేశంలో రైతుల తుఫాన్​
  • దీన్నెవరు ఆపలేరు
  • మహారాష్ట్రలోని ప్రతి ఎకరాకు కృష్ణా, గోదావరి జలాలు అందిస్తా
  • జిల్లా పరిషత్ లలో గులాబి జెండా ఎగరాలె
  • ఈ అయిదు పథకాలు ‘మహా’ అమలు చేయండి
  • అంటూ ఫడ్నవిస్​కు సవాల్​
  • దేశ పౌరుడిగా మహారాష్ట్రకు వస్తూనే ఉంటా
  • కాందార్​ లోహలో గులాబినేత, సీఎం కేసీఆర్​
  • త్వరలోనే షోలాపూర్​లో బీఆర్​ఎస్​ సభ

కాందార్​ లోహ నుంచి ముద్ర ప్రతినిధి:  త్వరలోనే దేశంలో రైతుల తుఫాన్​రాబోతున్నదని, దీనిని ఎవరు  ఆపలేరని బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్రమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మహారాష్ట్ర కాందార్‌ లోహలో ఆదివారం   బీఆర్‌ఎస్‌ నిర్వహించిన సభలో  కేసీఆర్‌ పాల్గొని  మాట్లాడుతూ ‘ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు జన్మనిచ్చిన మరాఠా పుణ్యభూమికి ప్రణామం. పార్టీలో చేరుతున్న నేతలకు హృదయపూర్వక స్వాగతం. లోహ సబకు తరలివచ్చిన ప్రజలు, రైతులకు ధన్యవాదాలు. నాందేడ్‌ వాసుల ప్రేమ కారణంగా ఇక్కడే రెండో సభ నిర్వహిస్తున్నాం. కేసీఆర్​కు ఇక్కడేం పని అని మాజీ సీఎం ఫడ్నవీస్‌ అంటున్నారు. భారత పౌరుడిగా ప్రతీ రాష్ట్రానికి వెళ్తానని సీఎం తెలిపారు. తెలంగాణాలో అమలు చేస్తున్న అయిదు పథకాలను అమలు చేస్తే ఇక్కడికి రాను అని సవాల్​ విసిరారు.  తెలంగాణలో రైతుబంధు, 24 గంటలు కరెంటు అందిస్తున్నాం. అంబేద్కర్‌ పుట్టిన మహారాష్ట్రలో దళితబంధు అమలు చేయాలి.. తెలంగాణలో ఎకరానికి రూ.10వేలు ఇస్తున్నాం. తెలంగాణలో రైతులకు రూ.5లక్షల రైతుబీమా ఇస్తున్నాం. పూర్తిగా పంట కొంటున్నాం. తెలంగాణ తరహా అభివృద్ధి ఫడ్నవీస్‌ చేస్తే నేను మహారాష్ట్ర రానని ప్రకటిస్తున్నా అని స్పష్టం చేశారు. తెలంగాణ తరహా పథకాలు మహారాష్ట్రలో అమలు చేయనంత వరకు నేను వస్తూనే ఉంటానని హెచ్చరించారు.  స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా పేదల బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలతో మన బతుకులు మారాయా?. రెండు పార్టీల పాలనలో రైతుల పరిస్థితి ఎందుకు మారలేదు ? నేను చెప్పేది నిజమో అబద్ధమో మీరో ఆలోచించండి అంటూ ప్రజలను కోరారు.

మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి నీరందిస్తాం..
కృష్ణా, గోదావ‌రి మ‌హారాష్ట్రంలోనే పుట్టాయి.. కానీ సాగు, తాగునీటికి ఇబ్బందులే అని సీఎం కేసీఆర్​ అన్నారు.  కానీ మ‌హారాష్ట్రలో సాగు, తాగునీరు అన్ని చోట్లకు అందుబాటులో లేదు అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్  తెలిపారు. మ‌హారాష్ట్రలో సంప‌ద‌కు కొదువ లేదు.. ప్రజ‌ల‌కు ఇవ్వాల‌న్న మ‌న‌సు పాల‌కుల‌కు లేదు అని కేసీఆర్ ధ్వజ‌మెత్తారు. అమెరికా, చైనా కంటే నాణ్యమైన భూమి మనకు ఉందని కేసీఆర్​ తెలిపారు. కాంగ్రెస్‌ 54 సంవత్సరాలు, బీజేపీ 14 ఏళ్లు పాలించి ఏం చేశాయి? ఏటా 50వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని మండిపడ్డారు. మహారాష్ట్రలో పుట్టే కృష్ణా, గోదావరి నీళ్లు పుష్కలంగా  ఉన్నా రైతులకు ఎందుకు మేలు జరుగట్లేదు? అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో సాగు, తాగునీరు చాలాచోట్ల అందుబాటులో లేదు. మన కండ్ల ముందే నీరు సముద్రంలో కలిసిపోతుంది. ఎంత మంది పాలకులు మారినా ప్రజల తలరాతలు మారలేదని ఆరోపించారు. నేతలు తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని కేసీఆర్​ ప్రకటించారు. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి రూ.10వేలు ఇచ్చే వరకు కొట్లాడుతామన్నారు. దేశంలో సమృద్ధిగా సహజ వనరులున్నాయని,  దేశంలో 360 బిలియన్‌ టన్నుల బొగ్గు ఉందని, . దేశంలో ఉన్న బొగ్గుతో 24 గంటలు సులభంగా విద్యుత్‌ సులభంగా ఇవ్వొచ్చు అని తెలిపారు. 125 ఏళ్ల పాటు విద్యుత్‌ ఇచ్చేంత బొగ్గు మన దగ్గర ఉందని,  అయినా ఎందుకు విద్యుత్‌ ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు.  పీఎం కిసాన్‌ యోజన కింద కేంద్రం కేవలం రూ.6వేలు మాత్రమే ఇస్తుంది. పీఎం కిసాన్‌ కింద రైతులకు కనీసం రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఉల్లి, చెరుకు రైతులు ధరల కోసం ఏటా పోరాడాల్సిందేనా? ఇది రాజకీయ సభ కాదు. బతుకులపై ఆలోచన సభ. యూపీ, పంజాబ్‌లో నేతల మాయమాటలకు మోసపోయాం’ అని తెలిపారు. ఇకపై మహారాష్ట్ర ప్రజలు మోసపోవద్దని కోరారు. 


 ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలి ...
మహారాష్ట్రలో ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగుర వేయాలని కేసీఆర్​  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  ‘భారత రాష్ట్ర సమితి పార్టీని మహారాష్ట్రలోనూ రిజిష్టర్‌ చేయించామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. మీ సమస్యలు పరిష్కరించి చూపిస్తా, మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి మాకు విజ్ఞప్తులు వస్తున్నాయి. మా ప్రాంతంలో సభ పెట్టాలని అనేకచోట్ల నుంచి కోరుతున్నారు. తర్వాత షోలాపూర్‌లో సభ పెట్టబోతున్నట్లు తెలిపారు. మేం నాందేడ్‌లో సభ పెట్టగానే రైతుల ఖాతాల్లో రూ.6 వేలు వేశారని తెలిపారు. బీఆర్ఎస్​ సభ సత్తా ఏంటో మీకు అర్థమైంది కదా? ఫసల్‌ బీమా యోజన డబ్బు మీలో ఎవరికైనా అందిందా? అని ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించండి.. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. రైతులు ఐక్యంగా ఉండి పిడికిలి బిగిస్తే న్యాయం జరుగుతుంది. ఒక్క ఝలక్‌ ఇవ్వండి.. మొత్తం మారిపోతుంది. గతంలో మహారాష్ట్ర కంటే తెలంగాణ దారుణంగా ఉండేది. తొమ్మిదేళ్లలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ అభివృద్ధి చేశాం. 24 గంటలు పని చేసే నాందేడ్‌ ఎయిర్‌పోర్ట్‌ను పగటికే పరిమితం చేశారు. దేశం ముందుకు వెళ్తోందా..? వెనక్కి వెళ్తోందా? అనేక మంది ఉద్యమకారుల జన్మభూమి మహారాష్ట్ర. మహారాష్ట్రలో త్వరలో విప్లవం వస్తుంది. మహారాష్ట్రలో సంపదకు కొదవ లేదు. ప్రజలకు ఇవ్వాలన్న మనసు పాలకులకు లేదు’ అన్నారు. మీరు గెలిపించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ సమస్యలు పట్టించుకోకుండా ఎక్కడ నిద్రపోతున్నారంటూ ఆరోపించారు. బీఆర్​ఎస్​ను గెలిపించాలని ఆయన కోరారు.