సాయుధ బలగాల సంక్షేమమే మోడీ ప్రభుత్వ ధ్యేయం

సాయుధ బలగాల సంక్షేమమే మోడీ ప్రభుత్వ ధ్యేయం

28న హాకీంపేట్‌లో జాబ్‌ ఫెయిర్‌.. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి 
ముద్ర తెలంగాణ బ్యూరో: సాయుధ బలగాల సంక్షేమానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.‘అందరికీ ఉపాధి’ అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నినాదాన్ని దృష్టిలో ఉంచుకుని రక్షణ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఎక్స్ సర్వీస్‌మెన్ (మాజీ సైనికుల కోసం – ఈఎస్​ఎం) ఉపాధి సెమినార్‌లు, ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా మార్చి 28న హైదరాబాద్ హకీంపేటలో జాబ్ ఫెయిర్‌ నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దీనిలో ఉత్సాహంగా పాల్గొనేందుకు తాను ఎదురుచూస్తున్నా అంటూ ప్రకటన విడుదల చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ హకీంపేటలో నిర్వహించే ఈ మేళాలో దాదాపు 2,000 ఈఎస్​ఎంతో పాటు 50 కార్పోరేట్‌ కంపెనీలో రావచ్చని అంచనా వేస్తున్నట్లు జి కిషన్ రెడ్డి తెలిపారు. 


హకీంపేటలో జరిగేటటువంటి జాబ్ మేళాలను ఉమ్మడి వేదికపైకి తీసుకురావడానికి, రాబోయే కంపెనీలు, మాజీ సైనికులను ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవడానికి, అత్యంత నైపుణ్యం, అనుభవజ్ఞులు, ఆసక్తిగల మాజీ సైనికులను నియమించుకోవడానికి వీలు కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. “సాయుధ దళాలు దేశంలో అత్యంత గౌరవనీయమైన సంస్థ, మనందరికీ జాతీయ గర్వకారణం. సాయుధ దళాలకు చెందిన పురుషులు, మహిళలు దేశాన్ని కాపాడటంలో, అంతర్గత కలహాలను నిర్వహించడంలో, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తమవంతు సహాయాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అయినప్పటికీ, మన సాయుధ దళాల యువశక్తిని కొనసాగించడానికి, చాలా మంది సైనికులు చిన్న వయస్సులోనే పదవీ విరమణ చేస్తారు. అనంతరం వారు తమ కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూ కూడా.. ఉపాధి చూసుకుంటారు. ఇటువంటి జాబ్ మేళాల ద్వారా ప్రభుత్వం మాజీ సైనికులకు శిక్షణ, సంసిద్ధత, వారు ఎంచుకున్న రెండవ కెరీర్‌లో ప్రభావవంతంగా పునరావాసం కల్పించేలా చూస్తోంది” అని కిషన్ రెడ్డి చెప్పారు.