సిట్‌పై నాకు నమ్మకం లేదు

సిట్‌పై నాకు నమ్మకం లేదు
  • వచ్చిన సమాచారాన్ని ప్రజలకు తెలిపా
  • సిట్​ అధికారులకు బండి సంజయ్​ కుమార్​ జవాబు

ముద్ర తెలంగాణ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ  పేపర్ లీకేజీ  ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సిట్ అధికారులు రెండోసారి నోటీసుపై  బండి సంజయ్​కుమార్​ స్పందించారు. ఈ మేరకు సిట్​ అధికారులకు సమాధానం ఇచ్చారు. తనకు సిట్‌పై నమ్మకం లేదని అన్నారు. పార్లమెంట్ సమావేశాల  నేపథ్యంలో బిజీగా ఉన్నానని, ఇదే విషయాన్ని ఇప్పటికే తెలిపానని, అయినా మళ్ళీ నోటీసులు ఇచ్చారన్నారు. ‘‘మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను.. ఆ బాధ్యత గల మంత్రులు ఇద్దరు మాత్రమే ఉన్నారు..లీక్‌లో చాలా మంది ఉన్నారని, సిట్ హెడ్‌గా మీకూ తెలుసు.. స్కాంను తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం మొదటి నుంచి జరుగుతోంది.. రాజకీయాలను పక్కన పెట్టి మీ ఆత్మ సాక్షితో ఆలోచించండి.. ఈ స్కాంతో ఎన్నో లక్షల మంది మనో వేదనకు గురవుతున్నారు.. ఒక గ్రామం నుంచి ఎక్కువ మంది గ్రూప్ వన్‌కు సెలెక్ట్ అయ్యారని సమాచారం నాకు వచ్చింది.. దాన్ని ప్రజల ముందు పెట్టాను’’ అని పేర్కొన్నారు.

ప్రజా ప్రతినిధిగా వివిధ మార్గాల నుంచి తనకు సమాచారం వస్తుందని, ఈ సమయంలో పూర్తి వివరాలను బహిర్గతం చేయడం భావ్యం కాదని అనుకుంటున్నానని బండి సంజయ్ అన్నారు. అసలు విషయంపై విచారణ జరపకుండా తనకు నోటీస్‌లు ఇవ్వడానికే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తాను హాజరు కావడం లేదని మరోసారి స్పష్టం చేశారు. కాగా బండి సంజయ్‌కు బదులుగా ఆదివారం హిమాయత్ నగర్ సీట్ ఆఫీస్‌కు ఆయన లీగల్ టీమ్​ చేరుకుని అధికారులకు ఆయన తరపున వివరణతో కూడిన లేఖను అందజేశారు.