సుందరగిరిలో బడిబాట

సుందరగిరిలో బడిబాట

గడప గడపకూ ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రచారం..
హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు

చిగురుమామిడి ముద్ర న్యూస్: ప్రభుత్వ బడి అమ్మ ఒడి లాంటిదని జిల్లా సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారి ఆంజనేయులు, సుందరగిరి సర్పంచ్ శ్రీమూర్తి రమేష్, మండల విద్యాధికారి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని సుందరగిరి గ్రామంలో మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో గల వసతులను వివరించారు. విద్యార్థులకు ప్రభుత్వం రెండు జతల యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందిస్తోందని, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని వివరించారు. సుందరగిరి గ్రామంలో గల ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపిక కాగా విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి మెడబోయిన తిరుపతి, సుందరగిరి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎడబోయిన రవీందర్ రెడ్డి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పీలు పాల్గొన్నారు.