భారత్ నాకు ప్రత్యేకం

భారత్ నాకు ప్రత్యేకం
  • బ్రిటన్ ప్రధాని రిషి సునాక్

(ముద్ర, నేషనల్ డెస్క్​):-భారత్‌కు రావడం తనకు చాలా ప్రత్యేకమని బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ అన్నారు. తనను 'భారతదేశ అల్లుడు'గా పిలవడం బాగా నచ్చిందన్నారు. ఆప్యాయతతోనే తనని అలా పిలుస్తున్నారని ఆశిస్తున్నానన్నారు. భారత్‌ తన మనసుకు చాలా దగ్గరి దేశమని సునాక్‌ పేర్కొన్నారు. భారత్ లో జరుగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు రిషి సునాక్‌ తన సతీమణి అక్షతామూర్తితో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో రిషి దంపతులకు కేంద్ర మంత్రి ఆశ్వినీ చౌబే, భారత్‌లో బ్రిటన్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎలిస్‌ సహా ఇతర సీనియర్‌ దౌత్యవేత్తలు స్వాగతం పలికారు. తమ గౌరవార్థం ఏర్పాటు చేసిన సంప్రదాయ నృత్య ప్రదర్శనను వారు ప్రశంసించారు.  పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో రిషి సునాక్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, అంతర్జాతీయ సంబంధాల నిర్మాణం వంటి స్పష్టమైన లక్ష్యాలతో తాను భారత పర్యటనకు వచ్చానన్నారు.