మహిళలను తలెత్తుకునేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది

మహిళలను తలెత్తుకునేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది
  • ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
  • మల్లన్న సాగర్ వద్ద ఘనంగా మంచినీళ్ల పండుగ

ముద్ర ప్రతినిధి : సిద్దిపేట: రాష్ట్రంలో మహిళలను గర్వంగా తలెత్తుకునేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కొనియాడారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని ఇచ్చి మహిళల బాధలు తీర్చిన పెద్దన్న కేసీఆర్ అని ఆమె అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నాడు జరిగిన మంచినీళ్ల పండుగలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీపీగా తాను ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ కొందరు నన్ను రైతులు ఆత్మహత్య చేసుకునే రాష్ట్రం మీద అంటూ హేళన చేశారని అప్పుడు తాను వారి ముందు తలదించుకున్నానని ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గతాన్ని ఈ సభలో ప్రస్తావించారు.

 కృష్ణ శిలతో యాదాద్రిలో ప్రపంచ స్థాయి దేవాలయం నిర్మించడం, రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి మంచినీళ్లు అన్నీ ఇవ్వడం, వ్యవసాయానికి సాగునీటి పథకాలు చేపట్టి పంటలు సమృద్ధిగా పండేలా ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలతో మహిళలతో పాటు అందరూ తలెత్తుకునేల రాష్ట్రం ప్రగతి సాధించిందని ఆమె కొనియాడారు.   సిద్దిపేట జిల్లా లోని మల్లన్న సాగర్ డ్యాం సమీపాన కొండపాక మండలం మంగోల్ లో ఉన్న మిషన్ భగీరథ మంచినీటి శుద్ధికరణ పథకం వద్ద ఈ సభను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.సభకు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి, జనగామ జిల్లా నుంచి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సిద్దిపేట జిల్లా నుంచి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,పలువురు జడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు,మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.