శభాష్...  సిపి శ్వేత

శభాష్...  సిపి శ్వేత
  • హఫ్ మారథాన్ ప్రమోషన్ కోసం
  • 16 కిలోమీటర్లు పరిగెత్తిన పోలీస్ కమిషనర్

ముద్ర ప్రతినిధి, సిద్ధిపేట: సిద్దిపేటలో ఆదివారం నాడు పోలీస్ కమిషనర్ చేసిన సాహసం అందరినీ ఆశ్చర్య చెకితులను చేసింది. ఆగస్టు 6న జరిగే హఫ్ మారథాన్ పోటీల ప్రమోషన్ కోసం సిపి ఏకంగా 16 కిలోమీటర్లు పరిగెత్తడం సంచలనం కలిగించింది. విధి నిర్వహణతో పాటు ఎప్పుడు మహిళా చైతన్య కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఉండే సిద్దిపేట పోలీస్ కమిషనర్ నేరేళ్లపల్లి శ్వేతారెడ్డి ఇప్పుడు ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ఆగస్టు 6న రంగనాయక సాగర్ కట్టపై హఫ్ మారథాన్ నిర్వహించాలని అనుకున్నదే తడవుగా ప్రమోటీ కార్యక్రమాన్ని ఆదివారం నాడు సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ వారు కోమటి చెరువు కట్ట పై ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ నేరేళ్లపల్లి శ్వేతా రెడ్డి తో పాటు పలువురు అధికారులు, రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కత్తుల బాపురెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటస్వామి,వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉపాధ్యాయ, ఉద్యోగాల సంఘాల  నేతలు, పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు. సమావేశం అనంతరము రన్నింగ్ కార్యక్రమాన్ని రూబీ నెక్లెస్ రోడ్డుపై నిర్వహించారు దీంట్లో పలువురు యువకులు, దాదాపు పది కిలోమీటర్ల మేర పరుగెత్తారు ఒక్క పోలీస్ కమిషనర్ శ్వేతా రెడ్డి మాత్రమే 16 కిలోమీటర్లు పరిగెత్తి తన సత్తాను ప్రదర్శించారు. కమీషనర్ రన్నింగ్ సిద్దిపేటతో పాటు పట్టణ పరిసరాల గ్రామాల వరకు కొనసాగింది.