బహుదూరపు బాటసారి

బహుదూరపు బాటసారి
  • బతుకుదెరువు కోసం... 
  • ఆంధ్రా నుంచి తెలంగాణకు....
  • కుటుంబ పోషణకై ఒంటెతో కలిసి మహమ్మద్ హుస్సేన్ ప్రయాణం

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: అతనో బహుదూరపు బాటసారి... కుటుంబ పోషణకై రాష్ట్ర ఎల్లలు దాటి ప్రయాణిస్తున్నాడు... అతని ఉపాధికి  ఆధారం.. ఎడారి జీవి ఒంటె... యజమానితో పాటు అది కూడా రాష్ట్ర ఎల్లలు దాటింది. సిద్దిపేటలో అడుగుపెట్టింది.. శుక్రవారంనాడు 'ముద్ర ప్రతినిధి' ఈ బహుదూరపు బాటసారిని పలకరించినప్పుడు తన బతుకు పోరును వివరించారు. 30 ఏళ్ల జీవన గమనాన్ని నెమరు వేసుకున్నారు. తన పేరు మహమ్మద్ హుస్సేన్ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని కసుమూరు మండల కేంద్రం తన సొంత ఊరు అని తెలిపారు. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని వివరించారు.

46 ఏళ్ల మహమ్మద్ హుస్సేన్ గత 30 సంవత్సరాలుగా ఒంటెను గ్రామాలు, పట్టణాల్లో తిప్పుతూ తద్వారా వచ్చే ఆదాయం తోటే కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు బాగుండడంతో ఒంటె తోటి ఇక్కడికి వచ్చానని హుస్సేన్ చెప్పారు. దాదాపు పది సంవత్సరాల వయసున్న ఈ ఒంటెకు 'భాష 'అని ముద్దు పేరును పెట్టానని హుస్సేన్ తెలిపారు. తాను ఎలా చెప్తే అలా అది వింటుంది అని చెప్పారు. పల్లెల్లో, పట్టణాల్లో ఒంటె మీద కూర్చుని స్వారీ చేయాలనుకునే వారి నుంచి 50 రూపాయలు తీసుకుంటానని తెలిపారు. అదేవిధంగా పిల్లలకు,అనారోగ్యం గా ఉన్న, దిష్టి తగిలిన దాని నివారణకు దర్గాలో ప్రత్యేకంగా పూజించిన తాయత్తులను ఇవ్వడం ద్వారా వంద రూపాయలు తీసుకుంటానని చెప్పారు. తన వద్ద ఇప్పుడున్న ఒంటె చిన్న పిల్లగా ఉన్నప్పుడు లక్షన్నర రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినట్లు హుస్సేన్ వెల్లడించారు. ఇప్పుడు దాని వయసు10 ఏళ్లని చెప్పారు. తాను 15 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఇప్పటి దాకా ఒంటె లనే తమ కుటుంబం ఉపాధి మార్గంగా ఎంచుకున్నట్లు  తెలిపారు.

సిద్దిపేటలో ఒంటెకు ఆహారం కోసం ఎలాంటి ఇబ్బంది లేదని, ఇక్కడ చెట్లు అధికంగా ఉండడం వల్ల దానికి కడుపునిండా ఆహారం లభిస్తుందని అన్నారు. మామిడి, రాగి, వేప చెట్ల ఆకులు దానికి ఆహారంగా లభిస్తున్నాయని ఒక ప్రశ్నకు సమానంగా తెలిపారు. జొన్నలు, ఉలువలు, మరికొన్ని రకాల చిరుధాన్యాలు కూడా ఒంటెకు ఆహారంగా పెడుతానని హుస్సేన్ తెలిపారు. ఒంటెతో సిద్దిపేటకు రావడం వల్ల పవిత్రమైన బక్రీద్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరుల నుంచి ఆర్థిక సహాయాలు  లభిస్తున్నాయని తెలిపారు. ఇక్కడ కొన్ని రోజులు నివసించాక మరో ప్రాంతానికి బయలుదేరుతానని ఆయన చెప్పారు. సిద్దిపేట పట్టణము చాలా బాగుందని కర్నూలు జిల్లా వాసి హుస్సేన్ కితాబు ఇచ్చారు.