అన్నీ విద్యా సంస్థల్లో యోగ శిక్షణ

అన్నీ విద్యా సంస్థల్లో యోగ శిక్షణ
  • ప్రపంచానికి ఆరోగ్య భారత్ దిక్సూచి
  • పచ్చదనంలో తెలంగాణ నంబర్ వన్
  • రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట : ముద్ర ప్రతినిధి: ప్రజల మానసిక, శారీరక, ఆర్థిక వికాసానికి యోగ విద్య అద్భుతంగా పనిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు  హరీష్ రావు చెప్పారు. తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ జడ్జెస్ సర్టిఫికేట్ల పంపిణీ ఉత్సవం ఆదివారం మంత్రి క్యాంప్ ఆఫీసులో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి అద్భుత పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు.

భావి ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్రంలోని 26 వైద్య కళాశాలలో విద్యార్థులకు యోగ శిక్షణ అందిస్తున్నామని వివరించారు. ముందు ముందు తెలంగాణలోని అన్నీ విద్యా సంస్థల్లో యోగ విద్యను ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించారు. ఎండాకాలం వస్తే నీటి యుద్ధాలు జరిగేవనీ, పత్రికల్లో విస్తృతంగా వార్తలు వచ్చేవనీ మంత్రి అన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపరితల జలాలతో తాగునీటిని విస్తృతంగా అందించడం వల్ల మంచినీటి సమస్య లేదన్నారు. అదే విధంగా ప్రాజెక్టులు, కాలువలతో వ్యవసాయానికి నీరు అందించడం వల్ల మంచి పంటలు పండుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 7.4% పచ్చదనాన్ని కల్పించడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.  ప్రతిరోజు గంటలకొద్దీ టీవీలు చూడడం, సెల్ ఫోన్లను వాడడం చేస్తున్న ప్రజలు తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. కనీసం అరగంట సేపు యోగాసనాలు చేయడం ద్వారా తాము ఆరోగ్యంగా ఉంటారని, అప్పుడే ఆరోగ్య తెలంగాణ సాధన సులభం అవుతుందన్నారు.

గతంలో పేదోళ్లు రొట్టెలు, అంబలి,  ఘట్క, పండ్లు,  కూరగాయలు తినేవారని డబ్బున్న వారు అన్నం తినేవారని, కాగా అనూహ్యంగా మారిన పరిస్థితుల్లో ఇది ఇప్పుడు వ్యతిరేకంగా మారి పోయిందన్నారు. యోగ శిక్షకులు,  న్యాయ మూర్తులు, సంస్థలు, ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృపాకర్, టెక్నికల్ కార్యదర్శి తోట సతీష్, జిల్లా గౌరవ అధ్యక్షులు కే. అంజయ్య, అధ్యక్షులు తోట అశోక్ , ప్రధాన కార్యదర్శి నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, యోగ శిక్షకులు  శిక్షకురాలు సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి పాల్గొన్న యోగ న్యాయమూర్తులకు,  జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన వారికి మంత్రి చేతుల మీదుగా సర్టిఫికేట్లను పంపిణీ చేశారు.