టిఆర్ఎస్ కథ ముగిసింది ఇక బిజెపి మిగిలింది
- ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యం
- మంత్రి పొన్నం ప్రభాకర్
- ప్రారంభమైన చల్లా పాదయాత్ర
ముద్ర, షాద్ నగర్:9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనకు అంతం పలికిన ప్రజలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కూడా గుణపాఠం చెప్పనున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఆదివారం షాద్ నగర్ నియోజక వర్గంలో ప్రారంభమైన చల్లా న్యాయ యాత్ర షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కొనసాగింది.
యాత్రకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డిలు హాజరయ్యారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను గత పదేండ్లు అధికారంలో ఉన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గారంటీలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు పేద ప్రజల అభివృద్ధి కోసం కంకణబద్ధంగా ముందుకు సాగుతోందని ఇందులో భాగంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి సంక్షేమానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. సిడబ్ల్యుసి కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీ చంద్ రెడ్డి గత బిఆర్ఎస్ ప్రభుత్వ తీరును విమర్శించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించుకోవడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.
జయప్రదంగా.. యాత్ర
పాలమూరు న్యాయ యాత్ర పేరుతో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీ చంద్ రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్ర ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చేరుకుంది. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో నియోజకవర్గంలో సాగుతున్న యాత్ర కాంగ్రెస్ సాగుతోంది. కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో ప్రారంభమైన న్యాయ యాత్ర కోసం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, స్థానిక నేత మామిడి శ్యాంసుందర్ రెడ్డి పార్టీలోని ఆయా శ్రేణులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వంశీ చందురెడ్డి మాట్లాడుతూ .. పదేండ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలమూరు జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చిందని ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీటి వసతులు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ప్రతి నియోజకవర్గంలోని మండలాలలో పర్యటించి సమస్యలను గుర్తించేందుకు యాత్ర చేపట్టామని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ, మండల కేంద్రాలలోనూ వస్తున్న ఆదరణ తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని పెర్కొన్నారు. చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక వారు పడుతున్న ఇబ్బందులను గుర్తించామని తెలిపారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రారంభించి సాగునీళ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని చెప్పారు. నారాయణపేట- కొడంగల్ నియోజకవర్గాలకు కృష్ణానది చెంతన ఉండి.. నీటి వనరులను సులభంగా వినియోగించుకునే అవకాశాలు ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం 160 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి నీళ్లను తెస్తామని గొప్పలు చెప్పిందని వివరించారు. పదేళ్లు దాటిన చుక్క నీళ్లు రాలేదని అందుకే నారాయణపేట- కొడంగల్ అంశం తెరపైకి వచ్చింది. ఈ పథకాన్ని చేపట్టి మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలలోని లక్షా 30 వేలకు పైగా ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4800 కిలోమీటర్లు, ఇప్పుడు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు 6000కు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్య, మెరుగైన ప్రయాణ రంగాలకు ప్రాధాన్యం ఇస్తాంమని యువతకు విద్య, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పరిశ్రమలను నెలకొల్పుతామని, వాటిని మేనిఫెస్టోలో పొందుపరుస్తామని వివరించారు.ఈ పాదయాత్రలో మాజీ ఎంపీపీ వేణుగోపాల్ గౌడ్, మాజీ సర్పంచ్ సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు సిద్ధార్థ రెడ్డి ,గోవర్ధన్ గౌడ్, జితేందర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు