‘పాల‌మూరు – రంగారెడ్డి’ని అడ్డుకున్నది కాంగ్రెస్​నేతలే!

‘పాల‌మూరు – రంగారెడ్డి’ని అడ్డుకున్నది కాంగ్రెస్​నేతలే!
  • హరితహారంపై శాసన సభలోజోకులేశారు
  • కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ధ్వజం
  • మహేశ్వరానికి మెడికల్ కాలేజీ మంజూరు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : పాల‌మూరు– రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ నేత‌లే అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎండిపోయిన గ‌డ్డకు నాలుగు నీళ్ల చుక్కలు తెచ్చుకుందామంటే కాంగ్రెస్ నాయ‌కులు సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చి ఆపుతున్నార‌ని ఆరోపించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని అర్బన్‌ పార్కులో సీఎం కేసీఆర్‌ మొక్కలు నాటారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. 

హామీ ఇస్తున్నా.. నీళ్లు తీసుకొస్తా..

ఇబ్రహీంప‌ట్నం, మ‌హేశ్వరం నియోజ‌క‌వ‌ర్గాల్లో నీళ్ల కోసం పంచాయ‌తీ ఉంది. పాల‌మూరు – ఎత్తిపోత‌ల కూడా కాళేశ్వరంతో పాటే పూర్తయ్యేది. కానీ కాంగ్రెస్ నాయ‌కులు సుప్రీం కోర్టు దాకా వెళ్లి అడ్డుకున్నారు. ఎండిపోయిన గ‌డ్డకు నాలుగు నీళ్ల చుక్కలు తెచ్చుకుందామంటే కాంగ్రెస్ నాయ‌కులు స్టేల‌తో ఆపుతున్నారని తెలిపారు. భ‌గ‌వంతుడి ద‌య వ‌ల్ల పాల‌మూరు ప్రాజెక్టు 85 శాతం పూర్తయిందన్నారు. మ‌హేశ్వరం, ఇబ్రహీంప‌ట్నం, తాండూరు, ప‌రిగి, వికారాబాద్ చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గాల‌కు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని అన్నారు. ‘హామీ ఇస్తున్నా.. 100 శాతం ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకువ‌స్తా’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా న‌దిలో నీళ్ల కోసం పంచాయ‌తీ ఉంద‌ని, గోదావ‌రిలో నీళ్ల పంచాయ‌తీ లేదన్నారు. గండిపేట‌, హిమాయ‌త్ సాగ‌ర్ వ‌ర‌కు గోదావ‌రి లింక్ అయిపోతుంది. అక్కడ్నుంచి చిన్న లిఫ్ట్ పెట్టినా నీళ్లు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఏదో ఒక ప‌ద్ధతిలో ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చి ఇస్తానని, దిగులుపడొద్దని అన్నారు.

హ‌రిత‌హారంపై కాంగ్రెస్ జోకులేసింది..

మ‌న‌కు భూమి, నీళ్లు, అడ‌వులు ఉన్నాయి. విస్తృతంగా చెట్లు పెంచితే అపార‌మైన ఆక్సిజ‌న్ ల‌భిస్తుంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. అద్భుత‌మైన అవ‌కాశం ఉన్న దేశంలో అడ‌వుల‌ను నాశ‌నం చేశారు. హ‌రిత‌హారం అని చెబితే చాలా మందికి అర్థం కాలేదు. హాస్యాస్పదం చేశారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాస‌న‌స‌భ‌లో జోకులు వేశారు. తుమ్మలూరులో మూడు, నాలుగేండ్ల కింద నాటిన మొక్కలు పెద్దవయ్యాయి. అన్ని ప్రాంతాల్లో నాటిన మొక్కలతో తెలంగాణ‌లో 7.7 శాతం ప‌చ్చదనం పెరిగింది. అంద‌రి క‌న్నా ముందుగా మ‌న గ్రామ స‌ర్పంచుల‌ను అభినందిస్తున్నా. నేను చ‌ట్టం తెచ్చిన‌ప్పుడు వాళ్లకు కోపం వ‌చ్చింది. ఆ చ‌ట్టం వ‌ల్ల ఇవాళ గ్రామాలు ప‌చ్చగా మారాయి. తెలంగాణ‌లో దారులన్నీ అందంగా త‌యార‌య్యాయ‌ని కేసీఆర్ తెలిపారు.8 ఏండ్ల నుంచి ప‌ట్టుబ‌ట్టి, జ‌ట్టుక‌ట్టి బీడు వారిన తెలంగాణ‌ను ఒక తొవ్వకు తెచ్చుకుంటున్నాం. వ‌డ్లు పండించ‌డంలో 2014లో మ‌నం 15,16వ స్థానంలో ఉన్నాం. ఇవాళ దేశంలో మొదటి స్థానానికి వచ్చినట్లు ప‌త్రిక‌ల్లో వ‌చ్చింది. ఇలా అనేక రంగాల్లో నంబ‌ర్‌వ‌న్‌లో ఉన్నామని పేర్కొన్నారు.

మహేశ్వరానికి వరాల జల్లు..

రంగారెడ్డి జిల్లాలోని మ‌హేశ్వరం నియోజ‌క‌వ‌ర్గానికి సీఎం వ‌రాల జ‌ల్లు కురిపించారు. విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అభ్యర్థన‌ మేర‌కు మెడిక‌ల్ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. తుమ్మలూరులో ఒక సబ్ స్టేష‌న్‌ మంజూరు చేస్తాం. వీలైనంత తొంద‌ర‌గా ఈ ప‌నులు పూర్తి చేస్తాం. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు మెట్రో వ‌స్తుంది. మీ వ‌ర‌కు కూడా తెస్తాం. బీహెచ్ఈఎల్ నుంచి కందుకూరు వ‌ర‌కు మెట్రో తెచ్చేందుకు ప్రయ‌త్నం చేస్తామని కేసీఆర్​ప్రక‌టించారు. తుమ్మలూరులో రూ. కోటితో క‌మ్యూనిటీ హాల్ మంజూరు చేస్తున్నాం. దానికి ద‌శాబ్ది క‌మ్యూనిటీ హాల్ అని నామ‌క‌ర‌ణం చేయాల‌ని కోరుతున్నాం. మ‌హేశ్వరం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 65 జీపీలకు రూ.15 ల‌క్షల చొప్పున ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నాం. జ‌ల్‌ప‌ల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీల‌కు రూ.25 కోట్ల చొప్పున, బ‌డంగ్‌పేట్‌, మీర్‌పేట మున్సిప‌ల్ కార్పొరేష‌న్లకు రూ.50 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, రాచకొండ సీపీ చౌహాన్, ప్రభుత్వ ఉన్నత అధికారుల పాల్గొన్నారు. 

పైసలు పోయినా పంటలు కాపాడాలి

 రాష్ట్రంలోని వ్యవసాయాన్ని,  రైతులను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ కర్తవ్యమని సీఎం కేసీఆర్ అన్నారు. రైతులకు వానాకాలం పంటకు సాగునీటి సరఫరా కోసం సోమవారం మంత్రులు, ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జూలై మొదటి వారం దాకా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. 24 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తున్నామని, పట్టాలు పొందిన రైతులకు రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పనులపై సమీక్షించారు. సుప్రీంకోర్టు తీర్పుకి లోబడి ఆగస్టు చివరి నాటికి తాగునీటి కోసం నార్లాపూర్, ఏదుల, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాలలోకి నీటిని ఎత్తిపోయాలని, అందుకు అవసరమైన అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా  తెలంగాణ సాధించిన ప్రగతిని నివేదిస్తూ ఫొటోలు, సమాచారంతో ప్రభుత్వం రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ‘మెర్క్యురియల్ రైజ్ ఆఫ్ తెలంగాణ’ ను సీఎం ఆవిష్కరించారు.  కార్యక్రమంలో సమీక్షలో మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

హరితహారం - ట్రీ టూన్స్ కార్టున్ ఆవిష్కరణ..

ప్రకతి, పర్యావరణంపై అవగాహన కలిగించేలా  హరితహాసం ట్రీ టూన్స్ పేరుతో రూపొందించిన కార్టూన్ సంకలనాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మార్గదర్శకంలో కార్టూనిస్టు మృత్యుంజయ్ హరితహాసం ట్రీ టూన్స్ కార్టున్లను గీశారు. సోమవారం ప్రగతిభవన్ లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కేసీఆర్ కార్టున్ సంకలనాన్ని విదుదల చేశారు.