అవినీతి పీఠాలు కదులుతున్నాయి..... 

అవినీతి పీఠాలు కదులుతున్నాయి..... 
  • మున్సిపాలిటీలలో పీఏసీఎస్ లలో నెగ్గుతున్న అవిశ్వాసాలు , రాజీనామాలు 
  •  ఫలిస్తున్న జిల్లా మంత్రి ఉత్తమ్ ఆదేశాలు 

ముద్ర న్యూస్ నేరేడుచర్ల: గత బిఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అవినీతి, అక్రమాలు, కుళ్ళు కుతంత్రాలతో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మచ్చలేని పాలన అందిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన జిల్లా మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పీఠాలు కదులుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ ల అవినీతి అక్రమాలపై గుర్రుగా ఉన్న కౌన్సిలర్లు రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన కొద్ది రోజుల్లోనే మున్సిపల్ సహకార సంఘాల చైర్మన్ లపై అవిశ్వాస తీర్మానాలకు తెర లేపారు. ఫలితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మున్సిపాలిటీలో అధికార మార్పిడి జరిగింది. అలాగే పలు సహకార సంఘాల్లో సైతం చైర్మన్లను డైరెక్టర్లు గద్దె దింపారు. ఇదిలా ఉండగా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి సహకార సంఘం చైర్మన్ పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రాగా మొదట సహకార సంఘం చైర్మన్ పై ఆ సంఘం డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానానికి జిల్లా కలెక్టర్ కు జిల్లా సహకార సంఘం అధికారికి దరఖాస్తులు చేసుకున్నారు.

దీంతో అవిశ్వాస తీర్మానానికి సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ అవిశ్వాసం కోరిన డైరెక్టర్లు ఎవరూ సమావేశానికి హాజరు కాకపోవడంతో అవిశ్వాసం  వీగిపోయింది. అయితే అంతకు ముందు రోజే డైరెక్టర్లు అందరూ సహకార సంఘాల్లో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీయాలని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ 5 మెన్ కమిటీ నియమించి విచారణ చేపట్టారు. అనూహ్యంగా విచారణ ప్రారంభించిన మరుసటిరోజే ఆ సహకార సంఘం చైర్మన్ అనంత్ శ్రీనివాస్ గౌడ్ తన పదవికి రాజీనామా సమర్పించారు.2020-21 సంవత్సరంలో ‌ సహకార సంఘం పరిధిలో ధాన్యం కొనుగోళ్ళలో సంఘం సీఈవోతో కుమ్మక్కై చేతివాట ప్రదర్శించి కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాదాపు 1,25,772 బస్తాల ధాన్యం రెండు కోట్లకు పైగా నగదు బినామీలు , బంధువుల పేరిట డ్రా చేశారని , సన్న రకం వడ్లను కొనుగోలు చేసి దొడ్డు వడ్లను కొన్నట్లుగా రికార్డులు సృష్టించారని  ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు.