శ్రీరాముణ్నే అవమానించిన కాంగ్రెస్

శ్రీరాముణ్నే అవమానించిన కాంగ్రెస్
ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ
  • పిలిభిత్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ

యూపీ: లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనా కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా కాంగ్రెస్ శ్రీరామచంద్రుణ్నే అవమానించిందని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని నిలుపుదల చేయించడానికి కాంగ్రెస్ తన శాయశక్తులా ప్రయత్నించిందని అన్నారు. చివరికి ప్రజలంతా కలిసికట్టుగా పైసా పైసా వెచ్చించి అయోధ్యలో అద్భుతమైన రామ మందిరాన్ని నిర్మించారని అన్నారు. మీరు (కాంగ్రెస్) చేసిన తప్పులన్నింటినీ క్షమించి మిమ్మల్ని ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తే, దాన్ని తిరస్కరించడం ద్వారా శ్రీరామచంద్రుణ్ని అవమానించారని అన్నారు. ఈ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యే కాంగ్రెస్ నేతలను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించినట్టుగా ప్రధాని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, "భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే మా లక్ష్యం మేరకు మేము కృషి చేస్తున్నాము. ఎన్ని అడ్డంకులెదురైనా సరే, తమకు సాధ్యం కానిదేదీ లేదని భారతదేశం గర్వంగా చెబుతోందని ఆయన అన్నారు.

"14 సంవత్సరాలలో ఎస్‌పి, బిఎస్‌పి మరియు కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో చెరకు రైతులకు అందిన దానికంటే ఎక్కువ డబ్బును యోగి ప్రభుత్వం ఇక్కడ చెరకు రైతులకు ఇచ్చింది." అని ప్రధాని తెలిపారు.  ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఉత్తరప్రదేశ్‌లోని రైతులు తమ బ్యాంకు ఖాతాల్లోకి దాదాపు రూ.70,000 కోట్లు అందుకున్నారని ఆయన చెప్పారు. "కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచం నుంచి సహాయం కోరింది, కానీ COVID-19 మహమ్మారి సమయంలో, భారతదేశం ప్రపంచానికి మందులు మరియు వ్యాక్సిన్‌లను పంపింది. ఇది మీ ఒక్క ఓటు (బిజెపికి) కారణంగా సాధ్యమైంది" అని ప్రధానమంత్రి అన్నారు.

35 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబసభ్యులు పోటీలో లేకుండా...

ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్  లోక్ సభ నియోజకవర్గంలో 35 ఏళ్లలో తొలిసారిగా గాంధీ కుటుంబానికి చెందిన అభ్యర్థి  (మేనకా గాంధీ లేదా ఆమె కుమారుడు వరుణ్ గాంధీ) పోటీ చేయకుండా ఎన్నికలకు వెళ్లనున్నారు. పిలిభిత్‌ నుంచి ఎంపీగా ఉన్న వరుణ్‌కు టికెట్‌ నిరాకరించడంతో 2021లో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి మారిన ఉత్తరప్రదేశ్‌ మంత్రి జితిన్‌ ప్రసాద ప్రస్తుతం ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థిగా నిలిచారు. ఇదిలా ఉండగా, 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) భగవత్ శరణ్ గంగ్వార్ పేరును నామినేట్ చేసింది. పిలిభిత్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా అనిస్ అహ్మద్ ఖాన్‌ను ప్రకటించింది. ఈ నియోజకవర్గానికి ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది.