రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్తబ్దంగా ఉన్న తుంగతుర్తి కాంగ్రెస్ రాజకీయం

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్తబ్దంగా ఉన్న తుంగతుర్తి కాంగ్రెస్ రాజకీయం
  • టికెట్ల వేటలో ఆశావహులు టికెట్ నాకంటే నాకని పోటీపడుతూ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్న నేతలు
  • ఎవరు ఎక్కడ పోటీ చేయాలని వారిలో వారే సంప్రదింపులు
  • మాజీ మంత్రి సీనియర్ నాయకుడు దామోదర్ రెడ్డి ఆశీస్సులు ఉన్నవారికి టికెట్ ఇస్తారా?
  • లేక మాజీ మంత్రిని కాదని గతంలో మాదిరిగాఅభ్యర్థిని ఎంపిక చేస్తారా?
  • తుంగతుర్తి కాంగ్రెస్ లో అభ్యర్థి ఎవరనే లొల్లి ఇంకెన్నాళ్లు ?ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ క్యాడర్

తుంగతుర్తి ముద్ర:-రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో స్తబ్దత నెలకొంది . ఇందుకు ప్రధాన కారణం పార్టీ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలక పోవడమే. డజన్ మంది అభ్యర్థులు ఎవరికి వారు తమది టికెట్ అంటూ తలో మాట వివరిస్తూ క్యాడర్ను అయోమయానికి గురి చేయడంతో తాము ఎవరి వైపు ఎటు వెళ్ళాలో తెలియక అయోమయంలో పడ్డట్టు తెలుస్తుంది. తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న ప్రతి కాంగ్రెస్ ఆశావాది తనకు ఏఐసిసి పిసిసి నుండి ఆశీర్వాదాలు ఉన్నాయని టికెట్ తనదేనని బాహటంగానే చెప్పుకుంటున్నారు. మరి ఇంతమంది ఆశావహులకు ఏఐసీసీ, పీసీసీ ఆశీర్వాదాలు ఇస్తే కార్యకర్తలు  ఎవరిని నమ్ముకోవాలనే మాట సర్వత్ర వినవస్తుంది.

ఆశావహుల మాటలు ఇలా ఉండగా ఒకరిద్దరు నాయకులు తమ ఇరువురికి పిసిసి పెద్దల ఆశీర్వాదం ఉందని ఒకరు తుంగతుర్తి తీసుకుంటే మరొకరు కంటోన్మెంట్ తీసుకుందామని ఒప్పందంలో కూడా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది .ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉద్యమ నేత తుంగతుర్తి లేదా హైదరాబాద్ కంటోన్మెంట్ లలో ఏదో ఒక స్థానంలో తాను పోటీ చేస్తానని గతంలో తుంగతుర్తి నుంచి రెండుసార్లు పోటీ చేసిన నాయకుడిని సంప్రదించి ఆ నాయకుడు కంటోన్మెంట్లో పోటీ చేస్తే తాను తుంగతుర్తి నుండి పోటీ చేస్తానని లేదా  గతంలో పోటీ చేసిన అభ్యర్థి తుంగతుర్తి లోనే పోటీ చేస్తానంటే తను కంటోన్మెంట్ కు వెళ్తానని ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం .గతంలో రెండు సార్లు పోటీ చేసి స్వల్ప మెజార్టీతోఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు ఈసారి టికెట్ తనదేనని తుంగతుర్తి అభ్యర్థి తాను మాత్రమే నని ఘంటా పదంగా చెప్పుకోవడం గమనార్హం .

అదేవిధంగా పార్టీలో చేరిన ఉద్యమ నేత  తనకు తుంగతుర్తి లేదా కంటోన్మెంట్ కచ్చితంగా దక్కుతుందని మరో నాలుగైదు రోజుల్లో క్లారిటీ రావచ్చని ఒకటి రెండు రోజుల క్రితం తన అనుయాయుల వద్ద ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది .ఇదిలా ఉంటే మరో కాంగ్రెస్ నాయకుడు తాను ఎన్నికల బరిలో ఉండటం ఖాయమని తనకు మాజీ మంత్రుల అండ కూడా ఉందని టికెట్ తనదేనని ప్రచారం చేసుకుంటున్నారు.  నాయకులు కేవలం అసెంబ్లీ టికెట్ తనదేనని ప్రచారం చేసుకోవడమే సరిపోతుంది, కానీ కార్యకర్తలను సమీకరించడం పార్టీ నుండి బయటకు వెళ్లే వారిని బుజ్జ గించడం లాంటి పనులు మాత్రం చేయడం లేదని మాట కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు చెబుతున్న మాట. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా టికెట్ల లొల్లితో తంటాలు పడుతున్న నాయకులు ఇటు నియోజకవర్గంలో తిరగలేక అటు పిసిసి నాయకులు మెప్పు పొందడం కోసం తంటాలు పడుతున్నట్టు సమాచారం.

గత అసెంబ్లీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారకుడు అయ్యాడని కారణంతో పార్టీ నుండి సస్పెండ్ అయిన మరో ఆశావాది డాక్టర్ వడ్డేపల్లి రవికి పిసిసి ప్రచార కార్యవర్గ మెంబర్గా ఒకటి రెండు రోజుల క్రితం పదవి రావడంతో తుంగతుర్తి కాంగ్రెస్ రాజకీయాల్లో సమీకరణాలు మలుపులు తిరుగుతున్నాయన్న మాటవినవస్తోంది. నిన్న మొన్నటి వరకు సస్పెండ్ అయిన నాయకునికి టికెట్ రాదని చెప్పుకొచ్చిన మిగతా ఆశా వహులకు ఏకంగా పిసిసి అధిష్టానం పిసిసి ప్రచార కమిటీలో పదవి ఇవ్వడం వెనక మతలబు ఏమిటని చర్చిస్తున్నారు. అనాదిగా తుంగతుర్తి నియోజకవర్గంలో నాటి కమ్యూనిస్టు కోటలను బీటలు కొట్టి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెప లాడించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుత రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఆశీస్సులు ఉన్న వారికి తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ దక్కుతుందనే మాట బహిరంగ సత్యమే.

తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ కేడర్ అంతా గతంలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వద్ద పనిచేసిన వారే. నేడు మాజీ మంత్రి కనుసన్నలోనే వారు పని చేస్తున్నారన్న మాట సత్యమని చెప్పవచ్చు. దామోదర్ రెడ్డిని విమర్శించిన నాయకులు నియోజకవర్గంలో కనీసం ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితులు కూడా లేని సంఘటనలు చోటుచేసుకున్నాయి. అంటే నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి పట్టును అర్థం చేసుకోవచ్చు ప్రస్తుత డిసిసి అధ్యక్షుడు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇరువురు సైతం దామోదర్ రెడ్డి ప్రధాన అనుచర గణంలో ప్రధాన నాయకులు .మండల పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు అంతా దామోదర్ రెడ్డి అనుచరులే . అలాంటప్పుడు దామోదర్ రెడ్డిని దిక్కరించి బీఫాం పొందిన గత ఫలితాలు    పునరావృతం అవుతాయనే మాట వినవస్తోంది. నాడు దామోదర్ రెడ్డి ప్రధాన అనుచరుడు గుడిపాటి నరసయ్యకు బీ ఫామ్ దామోదర్ రెడ్డి ఆశీస్సులతో లభించగా ఏఐసీసీ నాయకుల చలువతో బీఫాం పొంది దామోదర్ రెడ్డి ప్రధాన అనుచరుడి బీ ఫామును క్యాన్సిల్ చేయించి పోటీలో నిలిచిన నాయకుడు ఓటమి పాలవడం అందరికీ తెలిసిన నగ్న సత్యమే. అలాంటి సందర్భాలున్న తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ ను మాజీ మంత్రి దామోదర్ రెడ్డిని కాదని దామోదర్ రెడ్డిని గతంలో విమర్శించిన వారికి ఇస్తారా ?అనే చర్చ సాగుతోంది. నియోజకవర్గంలో కొద్దిరోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టే సత్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ భిన్న అభిప్రాయాలతో విభిన్నమైన ఆలోచనలతో ఎవరికి వారే తమదే టికెట్ అనే లొల్లి తప్ప టికెట్ ఆశించే నాయకులందరూ ఇప్పటివరకు ఒకే వేదిక మీదికి వచ్చి తామంతా కలిసి పని చేస్తామని సంకేతాలు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వకపోవడం గమనార్హం. ఏవి ఏమైనా కాంగ్రెస్లో టికెట్ల లొల్లి అధికార టిఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశమని టికెట్ నాయకులు తనకు కొంతమేర సహకరిస్తారేమోనని ఆలోచనలు బిఆర్ఎస్ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది . పార్టీ టికెట్ రాని పక్షంలో డజన్ మంది ఆశావహుల్లో ఎంతమంది ఇండిపెండెంట్గా వేస్తారు? వారిలో ఎంతమంది టికెట్ వచ్చిన అభ్యర్థికి సహకరిస్తారు? వేచి చూడాల్సిందే.