విలక్షణ తీర్పు

విలక్షణ తీర్పు
  • మానకొండూర్ చొప్పదండిలో కాంగ్రెస్ విజయం 
  • హుజరాబాద్ లో టిఆర్ఎస్
  •  కరీంనగర్ ఫలితం పై సస్పెన్స్
  •  పోలింగ్ కేంద్రం వద్ద చార్జ్, ఉద్రిక్తత

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారు. ఈసారి మూడు నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు మార్పులు కోరుకున్నారు. ఉత్కంఠగా ఎదురుచూసిన అభ్యర్థులకు ప్రజల తీర్పు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నిరాశనం మిగల్చగా గెలిచిన అభ్యర్థులకు సంతోషాన్ని ఇచ్చింది. ఇది ఇలా ఉండగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం తీవ్ర ఉత్కంఠకు తెర తీసింది. రౌండ్ రౌండ్ కు నువ్వా నేనా అన్నట్లు బిఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్, బిజెపి అభ్యర్థి బండి సంజయ్ మధ్య హోరాహోరీగా కొనసాగింది. 26 రౌండ్లకు గాను 24 రౌండ్ల ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించగా గంగుల కమలాకర్ 88958, బండి సంజయ్ కుమార్ 84310 రాగా కాంగ్రెస్ అభ్యర్థి పురుమల శ్రీనివాస్ కు 37519 ఓట్లు వచ్చాయి. అయితే మరో రెండు రౌండ్లు ప్రకటించాల్సి ఉండగా రెండు ఈవీఎం లు మోరాయించాయి. 

ఈ సమయంలో 303 ఓట్లు గంగుల కమలాకర్ కు ఆదిత్యం లభించినట్లు అనధికారికంగా సూచించారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మురయించిన రెండు ఈవీఎంలలో బండి సంజయ్ కు అనుకూలమైన ఓట్లు లభించే ప్రాంతంలో ఉన్నాయని బిజెపి శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బండి సంజయ్ నేరుగా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఎన్నికల ప్రక్రియ పరిశీలించి రీకౌంటింగ్ కోరారు. దీంతో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కు పెద్ద ఎత్తున అటు బిజెపి శ్రేణులు ఇటు బిఆర్ఎస్ శ్రేణులు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు నినాదాలు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి చార్జి చేశారు. రీకౌంటింగ్ పై జిల్లా కలెక్టర్  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు విషయాన్ని తెలియజేశారు. దీంతో మొరాయించిన 2 ఈవీఎం వివి ప్యాట్లను లెక్కించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో 3162 ఓట్ల మెజారిటీతో గంగుల కమలాకర్ గెలిచినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బిటల్ మాట్లాడుతూ ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై మాకు అనుమానాలు ఉన్నాయని దీనిపై న్యాయ విచారణకు వెళ్తామని తెలిపారు.


కెసిఆర్ పాలనపై తీవ్ర ఆగ్రహం: మేడిపల్లి సత్యం
చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం బిఆర్ఎస్ అభ్యర్థి సుంకే రవిశంకర్ పై 37,439 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ 10 సంవత్సరాల కేసీఆర్ పాలనను ప్రజలు విసిగి పోయారని అన్నారు. అత్యధిక కోట్ల మెజారిటీతో గెలిపించిన చొప్పదండి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజారంజక పాలన అందించడానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని పేర్కొన్నారు.

నిరంతరం ప్రజల కోసమే జీవిస్తా : బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి


హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ పై 16873 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సంక్షేమ అభివృద్ధి కోసమే కృషి చేస్తానని పేర్కొన్నారు ఇంతటి ఘన విజయాన్ని అందించిన హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల కోసమే జీవిస్తా:  కవ్వంపల్లి సత్యనారాయణ
మానకొండూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ సమీప బిఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ పై 31742 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ నిరంతరం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. కేసీఆర్ పాలనకు ప్రజలు విసుగెత్తి పోయారని అన్నారు ఇంతటి ఘనవిజయాన్ని అందించిన మానకొండూరు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.