పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య

పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య

కేసముద్రం, ముద్ర: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ పేదల విద్యాభివృద్ధి కోసం వందలాది గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందుబాటులోకి తెచ్చారని, ఫలితంగా పేద విద్యార్థులు విద్యాభివృద్ధి చెందారని కేసముద్రం ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లో మంగళవారం చదువుల పండుగ, విద్యా దినోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ర్యాలీలు, మానవ హారం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందజేశారు. ఇనుగుర్తి, కేసముద్రం మండల కేంద్రాల్లోని బాలికల గురుకుల పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలల విద్యార్థినులు తమకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో రూపొందించిన ప్లకార్డులతో శోభాయాత్ర నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రిన్సిపాళ్లు విజయ లలిత, శైలజ రాణి, నీలిమ, ఇనుగుర్తి సర్పంచ్ దార్ల రామ్మూర్తి పాల్గొన్నారు.